శ్రీసిటీ, జనవరి 07, 2026:
ఆధునిక జీవన ఒత్తిళ్లు, ఆందోళనలు అధిగమించేందుకు ధ్యానమే తగు పరిష్కారం అని స్వామి స్మరణానంద స్పష్టం చేశారు. శ్రీసిటీ ఆధ్యాత్మిక-సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో యోగద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (YSSI) సంస్థ సహకారంతో “క్రియా యోగ ధ్యానం: ఒత్తిడి, ఆందోళనలకు శాశ్వత ఉపశమనం” అనే అంశంపై బుధవారం శ్రీసిటీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, ఘనంగా సత్కరించారు.
ఎనలేని ఆనందాన్ని పొందడమే జీవిత లక్ష్యంగా పేర్కొన్న స్వామి స్మరణానంద, అది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమని తెలిపారు. ఆనందం కోసం పలు విధాలుగా బయట వెదుకులాడుతున్నామని, అది అంతరంగంలో నిక్షిప్తమై ఉందన్నారు.
తైత్తిరీయ ఉపనిషత్తును ఉదహరిస్తూ దైవ స్వరూపం ‘సచ్చిదానందం’ అని, ఆ స్థితిని ప్రత్యక్షంగా అనుభవించడానికి ధ్యానమే మార్గమని చెప్పారు. ధ్యానం శారీరక–మానసిక–ఆధ్యాత్మిక సమతుల్యతను పెంపొందించి, అంతర్దృష్టిని బలోపేతం చేస్తుందని అన్నారు.
పరమహంస యోగానంద బోధనలను ప్రస్తావిస్తూ, నిరంతర సాధన మరియు అంతరంగ నిశ్శబ్దమే ధ్యానానికి పునాదిగా పేర్కొన్నారు. సరస్సులో అలల వలె మనస్సులో ప్రకంపనలు శాంతికి భంగం కలిగిస్తుందని, ధ్యానం ఆ సహజ ప్రశాంతతను పునరుద్ధరిస్తుందని వివరించారు.
హంస, ఓం, క్రియ యోగా వంటి ధ్యాన పద్ధతులు, వాటి ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమం ముగింపులో పలువురు క్రియా యోగ ధ్యానం అభ్యసించేందుకై ఆసక్తి కనబరుస్తూ YSSI హోమ్–స్టడీ పాఠ్యాంశాల్లో (తెలుగు, ఇంగ్లీష్) తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
ప్రసంగం అనంతరం స్వామీజీ శ్రీసిటీ పరిసరాలను సందర్శించారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, నక్షత్ర వనం, నవగ్రహ వనం వీక్షించారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఆహ్లాదభరిత వాతావరణంలో ప్రగతి దిశగా పయనిస్తున్న శ్రీసిటీ అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు.


