గాజువాక / పెదగంట్యాడ – (పున్నమి ప్రతినిధి)
గాజువాక పెదగంట్యాడకు చెందిన వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి గాజువాక సర్కిల్–3 అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ (ASO) టీ. కృష్ణను లంచం స్వీకరిస్తూ ఉండగా పట్టుకున్నారు.
గత ఫిబ్రవరిలో పీడీఎస్ రైస్ తరలిస్తుండగా పోలీసులు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తరువాత వాహనాల విడుదలకు సంబంధించి హైకోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నా కూడా, ఆ ఆదేశాలను అమలు చేయడానికి ఒక్కో వాహనానికి రూ.5,000 చొప్పున లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదుదారు ఏసీబీకి తెలిపాడు. రెండు వాహనాల్లో ఒకటి ఫిర్యాదుదారుదిగా, మరొకటి అతని స్నేహితుడు ఆకాష్‌దిగా పేర్కొన్నారు.
ఫిర్యాదు ఆధారంగా ఏర్పాటు చేసిన ఉచ్చులో ఏసీబీ అధికారులు టీ. కృష్ణను లంచం స్వీకరిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ వివరాలను ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం సంబంధిత అధికారిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు రమణమూర్తి వెల్లడించారు.


