చిట్వేల్ అక్టోబర్ 17(పున్నమి ప్రతినిధి)
అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్ కార్యాలయం (డిఈ ఆఫీస్) వద్ద, శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.కార్మికుల డిమాండ్లను న్యాయబద్ధంగా పరిష్కరించాలని, విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, అలాగే ప్రైవేటీకరణ విధానాన్ని తక్షణం ఆపాలని నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్. చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేల్ రవికుమార్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కనపర్తి కిరణ్, జిల్లా అధ్యక్షులు శ్రీహరి తదితరులు నేరుగా వేతనాలు చెల్లిస్తే సంస్థకు సంవత్సరానికి 192 కోట్ల రూపాయల ఆదా అవుతుందని, వేతన వ్యత్యాసాలను సవరించి పీస్‌రేట్ వర్కర్లకు కనీస వేతనం చెల్లించడం ద్వారా సంస్థకు కూడా లాభమని పేర్కొన్నారు.పెన్షన్ హక్కు బిక్ష కాదు, అది ఉద్యోగుల హక్కు మాత్రమే అని వారు స్పష్టం చేశారు. 1.2.1999 తర్వాత నియామకం పొందిన కార్మికులు, ఉద్యోగులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.“ఎంఎల్‌ఏలు, ఎంపీలు రెండు మూడు పెన్షన్లు పొందుతుంటే, ఎందుకు కార్మికులకు హక్కుగా ఉన్న పాత పెన్షన్ ఇవ్వడం లేదు?” అని వారు ప్రశ్నించారు.ప్రస్తుత ప్రభుత్వము గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తోందని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 9-10-2025 విద్యుత్ సవరణ బిల్లు ను వ్యతిరేకించాలని కార్మికులకు పిలుపునిచ్చారు.12 గంటల పని విధానం, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, మరియు విద్యుత్ ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగుతుందని స్ట్రగుల్ కమిటీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పందికాళ్ళ మణి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎరుకల రెడ్డి, వి. సుబ్రహ్మణ్యం, రమేష్, సిహెచ్. నారాయణ, చంద్రరాజు, ఆనంద్, బాలకృష్ణ, సురేంద్ర, సుధాకర్, కులయప్ప, చైతన్య, నాగ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


