క్రిష్ణా జిల్లాకు వంగవీటి పేరు, తిరుపతికి బాలాజీ పేరు, పల్నాడుకు జాషువా పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు
ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @
ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు పైన కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఈ మేరకు అభిప్రాయ సేకరణ చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుతో పాటుగా అవసరమైన మార్పుల దిశగా నిర్ణయం చేయనుంది.
జిల్లాల వారీగా సబ్ కమిటీలోని మంత్రులు పర్యటనలు చేసి.. తుది నివేదిక సిద్దం చేయనున్నారు. కొత్తగా జిల్లా పేర్ల విషయంలోనూ వినతులు వస్తున్నాయి. అదే విధంగా మండలాల పైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో కొత్త జిల్లాలు – మండలాలు ఏర్పాటు… పేర్ల మార్పు పైన సుదీర్ఘ కసరత్తు జరుగుతోంది. ఈ అంశం పైన ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తోంది. పలు జిల్లా ల పేర్లు మార్పు పైన వినతులు వస్తున్నాయి. క్రిష్ణా జిల్లాకు వంగవీటి పేరు, తిరుపతికి బాలాజీ పేరు, పల్నాడుకు జాషువా పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు అందాయి. ఇక.. రాష్ట్రంలో 6 కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపాదిత కొత్త జిల్లాలుగా పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లె, రాజంపేట మారనున్నట్లు తెలిసింది. ఇందులో ఒకట్రెండు స్థానాల్లో మార్పులు, చేర్పులు ఉండొచ్చు. ఇప్పటికే ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనుంది.
కాగా, ప్రస్తతం ఉన్న 26 జిల్లాలు 32కు పెరగనున్నట్లు తెలిసింది. అలాగే పునర్విభజనలో భాగంగా కొన్ని జిల్లాల కేంద్రాల మార్పు, రెవెన్యూ డివిజన్ల సర్దుబాట్లు ఉండే అవకాశం ఉంది. ఇక.. రాజధాని అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గ ఉప సంఘ సభ్యులు జిల్లాల వారీగా పర్యటించి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. మూడు బృందాలుగా మంత్రులు జిల్లా పర్యటన చేయాలని నిర్ణయించారు. ఈ నెల 29 30 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, బిసి జనార్దన్ రెడ్డి, అనిత పర్యటించనున్నారు.
అదే విధంగా సెప్టెంబర్ 2న అల్లురి జిల్లాలో పర్యటన ఉంటుంది. ఈ నెల 29 న పశ్చిమగోదావరి కృష్ణా జిల్లాల్లో మంత్రులు మనోహర్, నారాయణ పర్యటన చేయనున్నారు. 30 న చిత్తూరు, కడప జిల్లాల్లో.. అదే రోజున ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంత్రులు రామానాయుడు, సత్యకుమార్ పర్యటించున్నారు. గంటూరులో సెప్టెంబర్ 2న పర్యటించనున్న మంత్రివర్గ ఉప సంఘం తమ వద్దకు వచ్చిన అన్ని అభిప్రాయాలు.. సూచనలకు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. దీని పైన సంక్రాంతి వేళ ప్రభుత్వం కొత్త జిల్లాల పైన నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.


