గాజువాక, పెద్ద గంట్యాడ నవంబర్ (పున్నమి ప్రతినిధి):
రాష్ట్రాన్ని తిరిగి పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో మైలురాయిని సృష్టించారు. 17 జిల్లాల్లో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపారు. రెండో దశలో 329 ఎకరాల్లో 15 పార్కులు ప్రారంభమవ్వగా, మరో 587 ఎకరాల్లో 35 ప్రభుత్వ, ప్రైవేట్ పార్కులకు శంకుస్థాపన జరిగింది. “కనిగిరి కనకపట్నం అవుతుంది — అభివృద్ధి దిశలో ఆగని యాత్ర కొనసాగుతుంది” అని సీఎం పేర్కొన్నారు. తుఫానులో సమర్థవంతంగా పనిచేసిన అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశంసిస్తూ, “ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని నిరూపించాం” అన్నారు. “చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి స్థానికంగా ఉపాధి కల్పించే బాధ్యత నాది. ఇతరులు ఉద్యోగాలు ఇస్తామని చెబుతారు, కానీ నేను ఇంటికొక వ్యాపారవేత్తను తయారు చేస్తానని హామీ ఇస్తున్నాను” అని చెప్పారు.
విశాఖలో 7 కొత్త పార్కులు: విశాఖ జిల్లా పెదగంట్యాడ ఏపీఐఐసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డోలా వీరాంజనేయులు, మేయర్ పీలా శ్రీనివాస్, ఎంపీ ఎం. భరత్, ఎంఎస్ఎంఈ చైర్మన్ గండి బాబ్ది, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. మంత్రులు పెదగంట్యాడ, పెందుర్తి, ముదసరలోవ, గోపాలపట్నం ప్రాంతాల్లో రూ.700 కోట్ల వ్యయంతో ఏడు పార్కులను ప్రారంభించారు.
లక్ష్యం — 175 నియోజకవర్గాలు, 175 పార్కులు: ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తను తయారు చేయడమే లక్ష్యం” అన్నారు. 70 శాతం ప్రైవేట్ పెట్టుబడులు, 30 శాతం ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ పార్కులు ఏర్పడుతున్నాయని వివరించారు. “గత పాలకుల విధ్వంసక పాలనతో పరిశ్రమలు వెనక్కి వెళ్లాయి. వారు చేసిన పనులు బుద్ధి ఉన్నవాళ్లు చేయరు” అని చంద్రబాబు విమర్శించారు. “ఇప్పుడు పెట్టుబడులు వర్షం కురుస్తున్నాయి — గూగుల్‌తో సహా లక్షా నలభై వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి” అని తెలిపారు.
సీఐఐ సదస్సుతో మరిన్ని పెట్టుబడులు: నవంబర్ 14, 15 తేదీల్లో జరగబోయే సీఐఐ భాగస్వామ్య సదస్సులో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని మంత్రి సుభాష్ వెల్లడించారు. “పవన్ కళ్యాణ్ అండగా, లోకేష్ పట్టుదలతో, కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ మళ్లీ అభివృద్ధి దిశలో దూసుకుపోతోంది” అని సీఎం హామీ ఇచ్చారు.


