ఆటో డ్రైవర్లకు రూ.15000 ఆర్థిక సాయం
సెప్టెంబర్ 11 పున్నమి ప్రతినిధి @
ఏపీలోని ఆటో డ్రైవర్లకు సీఎం నారా చంద్రబాబు నాయుడు దసరా కానుక ప్రకటించారు. ఆటో డ్రైవర్లకు రూ.15000 ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. వాహనమిత్ర కింద రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా రూ.15000 అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఈ ఏడాది దసరా రోజున రూ.15000 ఇస్తామని అనంతపురం సభలో ప్రకటించారు. అలాగే రూ.2.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఎన్డీఏ ప్రభుత్వం అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను నిర్వహించింది. ఈ సభకు హాజరైన సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం వాహనమిత్ర కింద ఏటా రూ.15 వేలు అందిస్తామని ప్రకటించారు.
మరోవైపు ఏపీలో స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఉచిత బస్సు పథకం అమలుతో ఆర్టీసీ బస్సులలో ఆక్యుపెన్సీ పెరిగింది. మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో తమ ఉపాధికి గండి పడిందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఉచిత బసు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆటోలకు గిరాకీ తగ్గిందని.. తమ కుటుంబాలను పోషించుకోవటం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు కోరుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.


