ఖమ్మం జనవరి
(పున్నమి దిన పత్రిక జిల్లా ప్రతినిధి)
పాలేరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారని, రానున్న రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ‘నంబర్ వన్’గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
గురువారం ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీకి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను దయాకర్ రెడ్డి గారు పంపిణీ చేశారు.
ఖమ్మం రూరల్ మండలంలోని 105 మంది లబ్ధిదారులకు రూ.32,63,000,
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 73 మంది లబ్ధిదారులకు రూ.30,14,000 విలువైన చెక్కులను అందజేశారు. మొత్తం రూ.62.77 లక్షల సీఎంఆర్‌ఎఫ్ నిధులు పంపిణీ చేయడం విశేషం.
ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏదులాపురంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, ఆ ప్రాంతాన్ని రాష్ట్రం గర్వించేలా అభివృద్ధి చేసే బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు స్వయంగా తీసుకుంటారని భరోసా ఇచ్చారు.
మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిర్వచనం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా, ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతలను మహిళలకే అప్పగించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మహిళలను కేవలం ఓటర్లుగానే కాకుండా పాలకులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతోనే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో చైర్మన్ స్థానాల్లో మెజారిటీ సీట్లను మహిళలకు కేటాయించిందని గుర్తు చేశారు.
ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



