చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
అన్ని ఆపరేషన్లు విజయవంతం
నెల్లూరు జిల్లా,చేజర్లకు చెందిన హృద్రోగ నిపుణులు డాక్టర్ అల్లం రామ్ నరేష్ అరుదైన అద్భుత విజయం సాధించారు. ఒక ఏడాది కాలంలో వెయ్యి గుండె ఆపరేషన్లు చేసి రికార్డు సృష్టించారు.అన్ని ఆపరేషన్లు సక్సెస్ కావడం ఒక అద్భుతం. డాక్టర్ రామ్ నరేష్ కేరళలోని కాలికట్ లో ఉన్న శాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో హార్ట్ స్పెషలిస్ట్ గా పదేళ్లుగా పని చేస్తున్నారు. ఆయన గత ఏడాది కాలంలో చేసిన వెయ్యి గుండె ఆపరేషన్లు విజయవంతం అయ్యాయి. దీంతో శనివారం ఆ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన పోస్ట్ యాంజియోప్లాస్టి మీట్ 2025 సభలో డాక్టర్ రామ్ నరేష్ ను ఆ రాష్ట్ర ప్రముఖులు, సహచర వైద్యులు ఘనంగా సత్కరించారు. ఈ సభలో వైద్యశాలలోని డాక్టర్లతోపాటు ఆపరేషన్లు చేయించుకున్న వెయ్యి మంది పాల్గొన్నారు. తమ జీవితాలను కాపాడిన డాక్టర్ రామ్ నరేష్ అల్లంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ నరేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల వారికి మంచి వైద్యం అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలో ఆంధ్రాలో కూడా వైద్య సేవలు అందిస్తానని తెలిపారు. చేజర్లకు చెందిన డాక్టర్ అల్లం రామ్ నరేష్ తన విద్యాభ్యాసాన్ని మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో సాగించారు. ఆయన ఈ విజయం సాధించడం పట్ల ఆయన అభిమానులు, చేజర్ల మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.


