పున్నమి ప్రతినిధి :
రిజర్వేషన్ ఉన్నట్టా లేనట్టా?
మేడిపల్లి సర్పంచ్ ఎన్నిక న్యాయస్థానం మెట్లెక్కింది
ఎస్సీ మహిళ రిజర్వేషన్ స్థానంలో బీసీ అభ్యర్థి గెలుపుపై అభ్యంతరం
కుల ధ్రువీకరణ పత్రాలపై తీవ్ర ఆరోపణలు
పున్నమి న్యూస్ యాచారం
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నిక వివాదాస్పదంగా మారి న్యాయస్థానం వరకు చేరింది. మేడిపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించగా, ముచ్చర్ల సుగుణ సుమారు 300 ఓట్ల మెజారిటీతో ఆలంపల్లి లావణ్యపై విజయం సాధించారు. అయితే విజయం సాధించిన సుగుణ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో, ఎస్సీకి కేటాయించిన స్థానంలో ఆమె ఎన్నిక ఎలా చెల్లుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ మేరకు ఆలంపల్లి లావణ్య భర్త నరసింహ యాచారం మండల తహసీల్దార్, ఇబ్రహీంపట్నం ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టును ఆశ్రయించడంతో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా వినతి పత్రం అందజేశారు. నామినేషన్ పత్రాల పరిశీలన సమయంలోనే తాము అభ్యంతరం తెలిపినా అధికారులు పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే కులం మారుతుందా? అని ప్రశ్నిం చారు. రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం పొందారని ఆరోపించారు. సుగుణ కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసేటప్పుడు కుమారుడి కుల ధ్రువీకరణ పత్రాన్ని జత చేశారని, అదే ఆధారంగా సర్టిఫికెట్ జారీ చేసినట్లు తహసీల్దార్ వివరణ ఇచ్చినట్లు తెలిపారు. అయితే స్వలాభం కోసమే కుమారుడి కుల ధ్రువీకరణను ఉ పయోగించారని ఆరోపణలు చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ఎలాంటి విచారణ చేయకుండా కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందని, అఫిడవిట్లను సరిగా పరిశీలించలేదని ఆరోపించారు. ఎన్నికల అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించలేదని విమర్శించారు. ఈ వ్యవహారంలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తక్షణమే విచారణ జరిపి, అక్రమంగా గెలిచిన సర్పంచ్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ స్థానంలో ఆలంపల్లి లావణ్యను అధికారికంగా ప్రకటించాలని కోరారు. అప్పటివరకు గ్రామపంచాయతీలో ఎలాంటి అధికారిక వ్యవహారాలు జరపకుండా ఆదేశాలు జారీ చేయాలని, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టరు కోరారు



