తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు రాజమండ్రి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి విస్తృత చర్యలు చేపట్టబడుతున్నాయి. ట్రాఫిక్ డీఎస్పీ వై. శ్రీకాంత్ మరియు రాజమండ్రి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నగరంలోని ముఖ్యమైన జంక్షన్ల వద్ద సమగ్ర పరిశీలన నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.
జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పరిస్థితులను మెరుగుపరచడానికి డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలనలు నిర్వహించి, జిబ్రా లైన్లు, సిగ్నల్ వ్యవస్థ, ఫ్రీ లెఫ్ట్ వంటి అవసరమైన సౌకర్యాలను గుర్తించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన మార్పులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
రాజమండ్రి జైల్ రోడ్, ఏవి అప్పారావు రోడ్, జెఎన్ రోడ్ వంటి ప్రధాన రహదారులపై మొత్తం 60 ట్రాఫిక్ అవగాహన బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
దేవి చౌక్, తాడితోట వంటి రద్దీగా ఉండే ముఖ్యమైన జంక్షన్ల వద్ద రోడ్డు మరియు ఫుట్‌పాత్ ఆక్రమణలను గుర్తించి, వాటిని మున్సిపల్ కార్పొరేషన్‌తో సమన్వయం చేసుకొని తొలగించే చర్యలు చేపడుతున్నారు.
అదేవిధంగా, పట్టణంలోని ముఖ్యమైన జంక్షన్ల వద్ద మైక్ సిస్టంలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా డీటీసీ జంక్షన్ వద్ద మైక్ సిస్టంను ఏర్పాటు చేసి పరిశీలన అనంతరం మిగతా జంక్షన్లకు విస్తరించే ప్రణాళిక రూపొందించారు.
ఇటీవల రూపొందించిన ట్రాఫిక్ మరియు హెల్మెట్ అవగాహనపై షార్ట్ ఫిలిమ్స్‌ను నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద ఉన్న ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు.
ప్రజలు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, మోటార్ సైకిల్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి ఉల్లంఘనలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10,000/- జరిమానా తో పాటు జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు.
రాజమండ్రి పట్టణ ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలను పాటించి, ట్రాఫిక్ పోలీసులకు సహకరించి నగరంలో రవాణా సౌకర్యాలను సజావుగా కొనసాగించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

