*ఎర్ర చందనం రక్షణకు సంకల్పం తీసుకుందాం*
*అమరావతి ( విశాఖ పున్నమి ప్రతినిధి)
• అమూల్యమైన సంపదను భావి తరాలకు అందించాలి
• గత ప్రభుత్వ హయాంలో వన సంపదనూ వదల్లేదు… లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికేశారు
• అక్రమ రవాణా నిరోధానికి డ్రోన్లతో పహారా
• ఎర్ర చందనం ద్వారా వచ్చే ఆదాయంలో నిర్దేశిత శాతం ఎర్ర చందనం వనాల అభివృద్ధి, సంరక్షణకు కేటాయింపు
• ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక ప్రత్యేక టాస్క్ ఫోర్సుకు జీవం
• పోలీసు-అటవీ శాఖల సమన్వయం ప్రధానం
• ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై అటవీ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘ఎర్రచందనం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపద. పర్యావరణపరంగానూ, ఆధ్యాత్మికంగానూ, ఆర్థికంగానూ దీనికి ఉన్న ప్రాధాన్యం అపారమైంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలి. ఎర్ర చందనం విక్రయాల ద్వారా సమకూరే ఆదాయంలో నిర్దేశిత శాతం ఎర్ర చందనం విత్తనాలు జల్లడం, ఎర్ర చందనం వనాలు అభివృద్ధి, సంరక్షణకు కేటాయించే ఆలోచన చేస్తున్నాము’ అని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దుంగ కూడా అక్రమంగా బయటకు వెళ్లకూడదనీ, దీని కోసం ఓ పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. వ్యవస్థలన్నీ సమన్వయంతో పని చేస్తే అక్రమార్కుల ఆటకట్టించడం అసాధ్యం కాదన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొన్న కింగ్ పిన్స్ ను చట్టం ముందు నిలపడానికి ప్రత్యేక బృందాలను పోలీసు-అటవీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెట్లను నరకడానికి వస్తున్న కూలీలు, మేస్త్రీలు, సూపర్ వైజర్లు, గోదాము కీపర్లు వంటి కిందిస్థాయి వారిని గుర్తించి, వారికి చట్టంపై అవగాహన కల్పించి కౌన్సిలింగ్ చేసి, ఇతర ఉపాధి మార్గాలు చూపించాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం మధ్యాహ్నం అటవీశాఖ ఉన్నతాధికారులతో ఎర్ర చందనం పరిరక్షణ, అక్రమ రవాణా నిరోధానికి ఉన్న మార్గాలపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… ‘‘2015లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చొరవ తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే దీని కోసం ప్రత్యేకంగా ఆలోచించి రెడ్ సాందర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేశారు. కార్యకలాపాలను విస్తృతం చేశారు. ఐజీ స్థాయి అధికారిని టాస్క్ ఫోర్స్ కు నియమించి, అటవీ-పోలీసు అధికారులతో ప్రత్యేకంగా దళం ఏర్పాటు చేయించి ముందుకు వెళ్లారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత టాస్క్ ఫోర్సును ఓ పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేశారు. తత్ఫలితంగా అక్రమ రవాణాకు ద్వారాలు తెరిచినట్లయింది. ఫలితంగానే 2019-24 మధ్య లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికి అక్రమంగా తరలించారు. నేను ఇటీవల సందర్శించిన తిరుపతిలోని 8 గోదాముల్లో 2,63,267 ఎర్రచందనం దుంగులున్నాయి. కేవలం పట్టుబడిన దుంగలను బట్టి చూస్తేనే సుమారు 2 లక్షల చెట్లు నరికినట్లు అర్ధమవుతోంది. మరి అక్రమ మార్గాల్లో ఎన్ని లక్షల చెట్లను నరికివేశారో ఊహకు అందటం లేదు.
ఎర్రచందనం అనేది పర్యావరణహితమైన చెట్టు. అత్యంత పటిష్టంగా శేషాచలం అడవుల్లో మాత్రమే పెరిగే అరుదైన వృక్షం. ఇక నుంచి ఎర్రచందనం ఒక్క దుంగ కూడా బయటకుపోకుండా చేయాలి. దీనికి మన ముందున్న దారులన్నీ వినియోగించుకుందాం. మళ్లీ టాస్క్ ఫోర్సుకు జీవం పోసి, అక్రమ రవాణా నిరోధించే ప్రణాళికపై గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాను. స్మగ్లర్లపై పెట్టిన కేసుల్లోనూ న్యాయస్థానాల నుంచి వేగంగా తీర్పులు రావడం శుభసూచకం. అటవీ శాఖ సిబ్బంది ఎర్ర చందనం సంరక్షణను ఒక సంకల్పంలా తీసుకోవాలి.
• కేంద్ర సాయంతో ఎర్రచందనం వెనక్కు వస్తోంది
వైసీపీ హయాంలో అంతర్రాష్ట్ర ఒప్పందాలను పట్టించుకోలేదు. ఫలితంగా ఎర్రచందనం సరిహద్దులు దాటి వేర్వేరు ప్రాంతాల్లో పట్టుకున్నా, దాన్ని వెనక్కు తీసుకురాలేకపోయారు. ఇటీవల కర్ణాటకకు వెళ్లినపుడు రూ.140 కోట్ల ఎర్రచందనం వారు పట్టుకొని, అమ్ముకున్నట్లు చెప్పడం నన్ను ఆలోచింప చేసింది. అంతర్రాష్ట్ర ఒప్పందాలను పటిష్టంగా అమలు చేసి ఉంటే, ఆ సంపద మనకు దక్కేది. ఈ అంశంపై కేంద్ర అటవీశాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారితో చర్చించాను. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మన రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా అయిన ఎర్రచందనం దుంగలు దేశంలో ఎక్కడ దొరికినా మనకు చెందేలా ప్రత్యేకంగా ఆదేశాలను ఇప్పించాం. దీంతోనే ఇటీవల గుజరాత్ లో 5 టన్నులు, తమిళనాడు, రాజస్థాన్ ప్రాంతాల్లో 7 టన్నులు, కర్ణాటకలో 6 టన్నులు, ఢిల్లీలో 10 టన్నులు సీజ్ చేశాం. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నేపాల్ లో ఉన్న 173 టన్నల ఎర్రచందనం తిరిగి రాష్ట్రానికి రప్పించే ప్రక్రియ మొదలైంది. దీంతోపాటు వివిధ రాష్ట్రాల్లో 2019-24 ప్రాంతాల్లో పట్టుబడిన 407 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం కూడా తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నాం.
• సాంకేతికతకు తోడు మానవ కృషి అవసరం
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అందుబాటులో ఉన్న సాంకేతిక వినియోగానికి తోడు సిబ్బంది కృషి చాలా అవసరం. టెక్నాలజీతోపాటు సంకల్పం తోడైతేనే ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించగలం. పోలీసు-అటవీ అధికారుల ఆధ్వర్యంలో నిరంతరం ఎర్రచందనం స్మగ్లింగు జరిగే అవకాశం ఉన్న ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ డ్రోన్లతో నిఘాను పెంచాలి. అటవీ చెక్ పోస్టులను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలను అమర్చి, నిత్యం పర్యవేక్షణ చేయాలి. సరికొత్త బ్యారికేడ్లను చెక్ పోస్టుల వద్ద అమర్చి, బేస్ క్యాంపులు, వాచ్ టవర్లలో గస్తీ ముమ్మరం చేయాలి.
వన సంరక్షణ సమితి వాలంటీర్ల ఆధ్వర్యంలో చైతన్య సదస్సులను శేషాచలానికి ఆనుకొని ఉన్న అన్ని గ్రామాల్లో నిర్వహించాలి. గ్రామస్థులకు అక్రమ రవాణా నిరోధానికి సహకరించాలని ప్రత్యేక సదస్సుల ద్వారా విన్నవించాలి. పాత కేసుల్లో ఉన్న వారి వివరాలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని, వారి కదలికలను రికార్డు చేయాలి. ఎర్రచందనం కేసుల పరిష్కారానికి వేగం పెంచాలి. 60 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు చేయాలి. ఆర్మ్డ్ బేస్ క్యాంపులను విస్తృతం చేయాలి. ఎక్కువగా అక్రమ రవాణా జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక కూంబింగ్ లను నిర్వహించాలి. అడవిలో ఎలాంటి అలికిడి, అలజడి గుర్తించినా, రక్షణ దళాలు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలి. అక్రమార్కుల ఆట కట్టించాలి.
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం విషయంలో సమన్వయం అనేది ప్రధానం. పోలీసు-అటవీ అధికారులు ఈగోలకు తావు లేకుండా జాతి సంపదను రక్షించాలనే అంకిత భావంతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడు కాని ప్రత్యేక నిఘా ద్వారా వారిని పట్టుకుంటాం. ప్రత్యేక ఇంటిలిజెన్స్ ఏర్పాటు చేసి, సమాచారాన్ని అక్రమార్కులకు చేరవేసేవారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు.


