ఎక్కడ??
సడ్లపల్లె
*********
అప్పుడే మొలిచిన తొలి ఆలోచనల్ని పేర్చి
మహా మంత్రాల వాహకాలుగా మార్చి
అందిన ఇంధనాల్ని అలవోకగా కాల్చి
అనేకానేక యాగాల్ని చేసి
అంది పుచ్చుకొన్న
అలనాటి శక్తులేమాయె??
మన ముఖాల్లాంటి మానవ రూపాల్ని తీర్చి
కడగండ్ల భూ మండలం మీదికి జార్చి
పై లోకాల్లో అందాల భామల్తో
హాయిని భోంచేస్తూ కులికే దేవాను దేవుళ్లను
మెగా తపో మహిమల్తో గడగడ లాడించి
భూతలం మీదికి ఈడ్చి
కష్టాలూ నష్టాల్ని తీర్చే
వరాల మూటలు అందుకొన్న వీర స్వాముల వారెక్కడ??
మానవాధములను ఆక్రమించి
మరణమృదంగం మోగించే రోగాల్ని
పరిశుద్ధ తీర్థ జలం తోనో
పవిత్ర వాక్కుల శక్తుల తోనో
స్వయంభూ దేహ ఆలింగనం తోనో
చిటికెలో పటాపంచలు చేసిన
పలుశ్రీసంబోధనల సమాజ ఉద్ధారకు లెక్కడ?/
ఒంటి మీది కుంటి వెంట్రుక పీకి
నోటితో ఒక్క వాక్యం పలికి
చేతి చిట్టి బెత్తం విసరి
దేవతల్నీ రాక్షసుల్నీ జంతువుల్నీ
క్రిముల్నీ పక్షుల్నీ పాముల్నీ శపించి
రాయీ రప్పలుగానో మరో కు రూపంగానో
మార్చే మాయల మరాఠీ మూకలెక్కడ??
ఇక్కడ మహా మహులంతా భయాలు మేసి
పిరికి రసం తాగి పిడుచకట్టి
అయోమయాంగులై అంగలారుస్తూ…!!
వాస్తవాలు మాట్లాడే వారిపై వ్యంగంగా విరుచుక పడుతూ…….
పనికిమాలిన పాండిత్యం ప్రదర్శిస్తూ………..
సేకరణ
వెంకటేశ్వర్లు