నవంబరు నెల నుండి ముఖ అధారిత హాజరు తప్పనిసరి
జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్
ఉపాధి హామీ కూలీలకు నవంబరు నెల నుండి ముఖ అధారిత హాజరు తప్పనిసరి కావున అందుకు అవసరమైన ఇ-కెవైసీ వెంటనే పూర్తిచేయాలని జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరు కార్యాలయం నుండి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉపాధి హామీ పధకంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు నిర్దేశించిన లక్ష్యాలపై, వాటి సాధనపై సమీక్షించారు. సమావేశంలో జిల్లా కలక్టరు మాట్లాడుతూ నవంబరు నెల నుండి ఉపాధి హామీ కూలీలకు హాజరు వేయాలన్నా, వారికి డబ్బులు అందించాలన్నా ముఖ అధారిత హాజరు తప్పనిసరి అని అందువలన ఇ-కెవైసీ వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలు ప్రకారం పనులు పూర్తిచేయాలని తెలిపారు. ప్రతి మండలానికి ఒక మేజిక్ డ్రయిన్ పూర్తిచేయాలని, లక్ష్యం మేరకు ఉపాధి హామీ పధకం కూలీలను సమీకరించాలని, వారికి కనీస వేతనం అందేలా పనులు కల్పించాలని తెలిపారు. ఇంటి నిర్మాణాలకు సంబంధించి 90రోజుల పనిదినాలు కల్పించాలని తెలిపారు. పి ఎం ఎ వై 1.0 పధకం డిశంబరు 2025 నాటికి పూర్తికానున్నందున లబ్దిదారులు ప్రతి ఒక్కరు ఈ పధకాన్ని సద్వియోగం చేసుకొనేలా, వారికి లబ్ది చేకూరేలా పనులు పూర్తిచేయాలన్నారు. ఉపాధి హామీ పధకం ద్వారా 2000 ఎకరాలలో పండ్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా లక్ష్యానికి మించి 2050 ఎకరాలలో పనులు చేయడం జరిగిందని వాటిని సంబంధిత యాప్ నందు నమోదుచేయాలని తెలిపారు. మండలాలకు మంజూరు చేసిన నీటికుంటలు, పశువుల షెడ్లు పనులు మొదలు పెట్టి పూర్తిచేయాలని తెలిపారు. సోషల్ ఆడిట్ లో గుర్తించిన రికవరీలు వసూలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల ఇళ్లు గృహప్రవేశాల కార్యక్రమానికి జిల్లా స్థాయి కార్యక్రమం పాయకరావుపేట మండలం నామవరం గ్రామం లే అవుట్ లో నిర్వహించడం జరుగుతుందని, కావున లే అవుట్ లో మౌళిక సదుపాయాలు పూర్తిచేయాలని సంబంధిత శాఖల అదికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ సమావేశంలో గృహనిర్మాణశాఖ ప్రోజెక్టు డైరెక్టరు శ్రీనివాస్, డుమా పిడి పూర్ణిమాదేవి, డిపిఒ సందీప్ ఇతర అదికారులు, మండల అభివృద్ది అధికారులు పాల్గొన్నారు.


