ఖమ్మం ఫిబ్రవరి
(పువ్వాడ నాగేంద్ర కూమర్
పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జ్ )
ఉద్యోగ విరమణ చేసి ఏడాది గడిచినా బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, అనారోగ్యంతో బాధపడుతున్న రిటైర్డ్ ఏఆర్ ఎస్సై మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఖమ్మం పోలీస్ సాయుధ దళంలో ఎస్సైగా సేవలందించిన కె. మైసయ్య గత ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ పొందారు. అయితే ఆయనకు రావాల్సిన సుమారు రూ.50–60 లక్షల ఉద్యోగ విరమణ బకాయిలు ఇప్పటికీ అందకపోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఈ క్రమంలో మైసయ్యతో పాటు ఆయన భార్య భాగ్యమ్మ కూడా అనారోగ్యానికి గురయ్యారు. బుధవారం రాత్రి వీరిద్దరినీ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. భాగ్యమ్మ ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు.
మైసయ్య ఆరోగ్యం మరింత క్షీణించడంతో బుధవారం అర్ధరాత్రి దాటాక ఆయన మృతి చెందారు. ఆసుపత్రి బిల్లుల చెల్లింపులో కుటుంబం ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిన విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం కొంతమేర బిల్లును చెల్లించి, మృతదేహాన్ని ఆయన స్వగృహానికి తరలించే ఏర్పాట్లు చేసింది.
ఉద్యోగ విరమణ బకాయిలు సమయానికి చెల్లించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కుటుంబ సభ్యులు, సహచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కోరుతున్నారు.


