డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అక్టోబర్ :
దేశంలో ఇతర ఉద్యోగులకెలాంటి అర్హతా పరీక్షలు లేకపోయినా, కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పుడే పదోన్నతి అర్హత ఇవ్వడం అన్యాయం అని పేర్కొంటూ సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ, నవంబర్ 24న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య (AIPTF) ఆధ్వర్యంలో భారీ “చలో ఢిల్లీ” ధర్నా నిర్వహించనున్నారు.
అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు బసవరాజ్ గురికర్ ఆధ్వర్యంలో జరిగిన అత్యవసర గూగుల్ మీట్లో 25 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని, దేశవ్యాప్తంగా వేలాదిమంది ఉపాధ్యాయులతో ఢిల్లీలో నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఈ వివరాలను జాతీయ కార్యనిర్వహక కార్యదర్శి ఎ.జి.ఎస్. గణపతి రావు వెల్లడించారు.
జాతీయ సెక్రటరీ జనరల్ కమల్‌కాంత్ త్రిపాఠి మాట్లాడుతూ, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, ఈ విషయమై ఇప్పటికే రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిని కలిసి తగిన చర్యలు తీసుకోవాలని ఏఐపిటిఎఫ్ నాయకులు కోరినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఆప్త) ప్రధాన కార్యదర్శి కె. ప్రకాశ్ రావు తెలిపారు.
ఈ ధర్నా కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ నుంచి 8,000 మంది, గుజరాత్ నుంచి 5,000 మంది, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల నుండి 2,000 మంది, హిమాచల్, పంజాబ్, అస్సాం, మిజోరాం, మేఘాలయ, మణిపూర్, వెస్ట్ బెంగాల్, ఒడిశా మరియు దక్షిణాది రాష్ట్రాల నుండి 5,000 మంది చొప్పున ఉపాధ్యాయులు పాల్గొంటారని నాయకులు తెలిపారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి కూడా ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఎ.పి. ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షబ్బీర్ హుస్సేన్ మరియు ప్రధాన కార్యదర్శి షానవాజ్ హుస్సేన్ మాజింద్రాణి పిలుపునిచ్చారు.


