పెద గంట్యాడ : డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
జీవీఎంసీ 76వ వార్డు పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న అల్లూరి సీతారామరాజు పార్కును జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ రాజు శనివారం సందర్శించారు. పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ పార్కు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, ప్రస్తుతం గార్డెన్ అభివృద్ధి పనులు మరియు బాక్స్ క్రికెట్ మైదానం ఏర్పాటు పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. త్వరలోనే అల్లూరి సీతారామరాజు పార్కును ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు తెలిపారు. ఈ పార్కు ప్రారంభంతో ప్రాంత ప్రజలకు వినోదంతో పాటు వ్యాయామ సౌకర్యాలు లభించనున్నాయని ఆయన అన్నారు.


