*అర్జీలు రీ-ఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలి*
*పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
*వివిధ సమస్యలపై 237 వినతులు సమర్పించిన ప్రజలు
*విశాఖపట్టణం పున్నమి ప్రతినిధి:- * ఒకే సమస్యపై అర్జీలు రీ-ఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలి, వినతులకు నాణ్యమైన రీతిలో ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కారం చూపాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ఫిర్యాదుదారులతో సంబంధిత అధికారి లేదా సిబ్బంది తప్పని సరిగా ఫోన్ ద్వారా సంప్రదించాలని, తగిన విధంగా ఎండార్స్మెంట్ వేసి ఇవ్వాలని చెప్పారు. సోమవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఇన్ఛార్జి డీఆర్వో సత్తిబాబు, విశాఖపట్టణం ఆర్డీవో సుధాసాగర్లతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదుదారులు వివిధ సమస్యలపై 237 వినతులు అందజేశారు. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 89, జీవీఎంసీ 67, పోలీస్ శాఖవి 15 ఉండగా, మరొక 69 ఇతర అంశాలకు చెందినవి ఉన్నాయి. దీనిలో భాగంగా కలెక్టర్ గత వారం జరిగిన పీజీఆర్ఎస్ పై సమీక్ష చేశారు. కాల్ సెంటర్ ఫీడ్ బ్యాక్ మరింత మెరుగుపడాలన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదు నమోదైన రెండు, మూడు రోజుల్లో ఆన్లైన్ లాగిన ఓపెన్లో పరిశీలించి తగిన చర్యలకు ఉక్రమించాలని సూచించారు. రీఓపెన్ అవుతున్న వాటిపై ప్రత్యేకంగా ఆర్డీవో స్థాయి అధికారి పరిశీలించి నాణ్యమైన రీతిలో పరిష్కారం చూపాలని, ప్రత్యేక ఎండార్స్మెంట్ ఇవ్వాలని చెప్పారు.


