విశాఖపట్నం జనవరి (పున్నమి ప్రతినిధి)
విశాఖపట్నం జిల్లాలో ప్రజల అర్జీల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కొరడా ఝులిపించారు. సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ (PGRS) సమీక్షలో అర్జీలను తూతూమంత్రంగా పరిష్కరిస్తున్న తీరుపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, హౌసింగ్ విభాగాల్లో సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా, యాంత్రికంగా ఎండార్స్మెంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో 2, 4, 5, 6, 8వ జోన్లకు చెందిన కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, డీఈలు, ఏఎస్ఓలతో కలిపి మొత్తం 10 మంది GVMC అధికారులకు మెమోలు జారీ చేశారు. ఈ నిర్లక్ష్యంపై పూర్తి వివరణ ఇవ్వాలని నోడల్ అధికారి శేషశైలజను కలెక్టర్ ఆదేశించారు. ప్రజల సమస్యలు కాలయాపన లేకుండా పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, తప్పుదారి పట్టించే వ్యవహారాలు సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు.



