*గాజువాక, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)*
జేసీఐ విశాఖ మెట్రో, ఓఎల్ ఓఎస్పీ సంయుక్త ఆధ్వర్యంలో గాజువాక 76వ వార్డు అమరావతి పార్కులో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. పార్కులో పేరుకుపోయిన చెత్త చెదారాలను తొలగించి పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.
సామాజిక సేవలో భాగంగా శ్రమదానం చేసిన నిర్వాహకులను మాజీ ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్ నరసింహారావు, భాజపా గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు, జేసీఐ జోన్-4 కమ్యూనిటీ డెవలప్మెంట్ జోనల్ డైరెక్టర్ బొత్స దిలీప్ కుమార్ అభినందించారు.
ప్రధాని మోదీ ఆశయాల స్ఫూర్తితో సామాజిక అభివృద్ధికి బాటవేసే కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛత, పచ్చదనం, ఆరోగ్య సమాజం కోసం భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
కార్యక్రమంలో జేసీఐ విశాఖ మెట్రో, ఓఎల్ ఓఎస్పీ అధ్యక్షుడు అర్జున్, సభ్యులు విఠల్ కుమార్, అవినాష్, హేమలత, వాసవి తదితరులు పాల్గొన్నారు.


