*అన్ని ఫైళ్లూ ఈ-ఆఫీస్ విధానంలోనే పంపించాలి*
* జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
*విశాఖపట్నం డిసెంబర్ 26 పున్నమి ప్రతినిధి * జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇకపై ప్రతి ఫైలు తప్పనిసరిగా ఈ-ఫైల్ రూపంలోనే నిర్వహించాలని, తనకి సమర్పించే ఫైళ్లను కూడా ఈ-విధానంలోనే పంపించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ఫిజికల్ ఫైళ్ల నిర్వహణకు పూర్తిగా స్వస్తి పలికి, ఈ-ఆఫీస్ విధానాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరి 15వ తేదీ తర్వాత ప్రజలకు ప్రభుత్వం అందించే అన్ని సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందించనున్నట్లు గుర్తు చేస్తూ స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17, 18వ తేదీల్లో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంశాలపై వివరించే నిమిత్తం కలెక్టరేట్ మీటింగ్ హాలులో అధికారులతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
*మనమిత్రపై మరింత అవగాహన పెంచాలి*
ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ‘మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా సేవలందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని కలెక్టర్ పేర్కొన్నారు. మనమిత్ర (95523 00009)ను ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ-ఫైల్ విధానం, ఆన్‌లైన్ సేవల అమలుపై జిల్లా స్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టి, నిర్ణీత గడువులో లక్ష్యాలు సాధించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
కార్యాలయ ఫైల్ నిర్వహణ, మెమోల జారీ, ఇతర అంశాల్లో ఏజెంట్ స్పేస్, సెర్చ్ బార్ అనే సాంకేతిక సాధనాలను ఉపయోగించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని చెప్పారు.


