రాజమహేంద్రవరం, అక్టోబరు 13: అన్ని హంగులతో కూడిన వినోదాత్మక చిత్రంగా ‘కె – రాంప్’ చిత్రం రూపొందిందని చిత్ర హీరో కిరణ్ అబ్బవరం చెప్పారు. సినిమా ఆద్యంతం స్పీడుగా నడుస్తుందని అందుకే రాంప్ అని పెట్టినట్లు తెలిపారు. హాస్య మూవీస్ పతాకంపై జైన్స్ నాని దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన ‘కె – రాంప్’ సినిమా ఈనెల 18వ తేదీన దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజమండ్రి వచ్చిన కిరణ్ అబ్బవరం స్థానిక హోటల్ షెల్టాన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన వచ్చిందన్నారు.
యుక్తి తరేజా, నరేష్, సాయికుమార్, అలీ, వెన్నెల కిషోర్, అజయ్ అనన్య, తదితరులు నటించిన ఈ సినిమా మాస్ కామెడీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని కిరణ్ అబ్బవరం చెప్పారు. బాలయ్య సాంగ్ తో ఎంట్రీ ఉంటుందని, పండగ సీజన్ కావడంతో కుటుంబ సమేతంగా వీక్షించాలనుకునేవాళ్లంతా ఖచ్చితంగా ఈ సినిమాకు వస్తారన్న నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తంచేసారు. సినిమాటోగ్రఫీ సతీష్ రెడ్డి, ఎడిటర్ చోటా కె ప్రసాద్, సంగీతం చైతన్ భరద్వాజ్ సినిమాకు మంచి రెస్పాన్స్ తెచ్చారని తెలిపారు.
ఘటోత్కచుడు వంటి పాత్రలతో కూడిన సినిమా చేయాలని ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా కిరణ్ అబ్బవరం తెలిపారు.
చెన్నై లవ్, ఉగాది రోజు టైటిల్స్ తో సినిమాలు చేస్తున్నానని మరో మూడు సినిమాలు కూడా చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎంత ప్రమోషన్ చేసినా ఈరోజుల్లో ప్రేక్షకులను థియేటర్ కి రప్పించడానికి ఎంత ప్రయత్నించినా రావడం చాల కష్టంగా మారిందని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఓటిటి ఫ్లాట్ ఫారం బాగానే ఉందని చెప్పారు.


