అనకాపల్లి జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఈపీడీసీఎల్ పరిధిలోని చౌడువాడ, కింతలిలో కొత్త విద్యుత్ ఉపకేంద్రాలను ప్రారంభించారు.
రూ.3.65 కోట్ల వ్యయంతో చౌడువాడలో, రూ.3.37 కోట్లతో కింతలిలో సబ్ స్టేషన్లు నిర్మాణం పూర్తయాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు కొణతల, బండారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏపీఈపిడిసిఎల్ పరిధిలోని 11 జిల్లాలలో రూ.250 కోట్లతో మొత్తం 69 సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ప్రతీ జిల్లాకు కొత్తగా 10 సబ్ స్టేషన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే సరికి స్థానికంగా విద్యుత్ అంతరాయాలు తగ్గుతాయని తెలిపారు.
అనకాపల్లి జిల్లాలో 20 వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సౌర విద్యుత్ సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతి వినియోగదారుడు ‘పీఎం సూర్యఘర్’ పథకాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
తక్కువ ధరలో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం విధించిన 40 పైసల ఎఫ్‌పిపిపి చార్జీలలో 13 పైసలు తగ్గించి వినియోగదారులకు నేరుగా లాభం చేకూర్చుతున్నామని వివరించారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా రూ.35 వేల కోట్లతో 65 లక్షల మందికి ప్రతి నెలా పెన్షన్లు అందిస్తున్నామని, రూ.10 వేల కోట్లతో ‘తల్లికి వందనం’ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
నర్సీపట్నం, మాడుగులను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి స్పష్టం చేశారు.


