(బాలపున్నమి)
శీనయ్య కష్టజీవి పొద్దస్త మానం పనిచేసి చేతికి వచ్చిన డబ్బులలో మూడొంతులు త్రాగి ఒక వంతు ఇంట్లో ఇచ్చే వాడు. పాపం భార్య సుమతి చాలీచాలని డబ్బుతో ఇల్లు గడపలేక పిల్లలకు సరియైన బట్టలు కుట్టించ లేక, మంచి ఆహరం పెట్టలేక చదువులు చెప్పించ లేక సతమతమౌ తుండేది. అనేక విధాల ఆమె భర్తకు చెప్పిచెప్పి అలసి పోయింది.
వారు పడే ఇబ్బందులు గమనించి చుట్టు ప్రక్కలవారు అతనిని, సన్మార్గాన పెట్టాలని విశ్వ ప్రయత్నం చేసి విసిగి వేసారి పోయారు. సంసా రంలో సుఖాలు చిమ్మే పన్నీరు వదలి వళ్ళుమరిచి అనారోగ్యానికిలోనయ్యే బురదలో వరాహం పొర్లాడుతానంటే ఎవరు కాదనగలరు? ఎంత మంది ఎన్ని రకాలుగా పోరాడినా అతనిలో మార్పు కనిపించక సంసారం గుడ్డెద్దు బండి లాగి నట్టుగా తయారైంది
ఒకరోజు అతని ఇంటి ముందుకు ఒక సాధువు బిక్షకు వచ్చాడు ఆయన ప్రత్యేకత ఏమిటంటే మనం దోసిట నిండా బియ్యం తీసుకుపోయినా రెండేళ్ళతో వచ్చినన్ని బియ్యం తీసుకుని నవ్వుతూ దీవించి వెళ్ళిపోతాడు.
అలాగే సుమతి తెచ్చిన బియ్యాన్ని తీసుకుని శీనయ్యను ఆయన సంసారాన్ని పరిశీలనగా చూసి ‘‘అయ్యా! తమరు తొందరలో అద్దాలమేడ కడ తారు. ఈ మాటలు నావి కావు అమ్మవారు నానోట పలికిస్తుంది అని శీనయ్యకు చెప్పి తన దారిన వెళ్ళి పోయాడు సాధువు. మద్యాన్నం తింటే మాపిటకు ఎలా చేద్దామా అనే దశలో మేముంటే, అద్దాల మేడ కడతామంట ఇలాంటి పిచ్చోళ్ళు వుండ బట్టే మన దేశం ఇలా తగలెడెతోంది అని తనలో తాను నవ్వుకున్నాడు శీనయ్య.
సాధువు మాటలు విన్న సుమతి ఒక కాగితంపై త్వరలో అద్దాల మేడ కడతాము అని వ్రాసి గొడకు అతికించింది.
రోజు ఆ అక్షరాలను చదువుతున్నాడు మన శీనయ్య తినగ తినగ వేము తియ్య నైనట్టుగా మరల మరల నెమరు వేసు కోవ టంతో సాధువు మాటలు మనసులో నాటుకు పోయాయి శీనయ్యకు ‘‘ఏమి వ్యాపా రం చేయాలన్నా మనకు పెట్టుబడి ఎవడి స్తాడు? అన్నాడు ఒకరోజు సుమతితో తలగీరు కుంటూ శీనయ్య.
శీనయ్య త్రాగి గుట్టవేసిన శీసాలను అమ్మి కొంత డబ్బు ఇచ్చింది సుమతి. ఆ డబ్బుతో ఎర్రగడ్డల వ్యాపారం పెట్టాడు. అందులో వచ్చిన డబ్బుతో బొరుగుల మిక్చరు బండి వేశాడు. అలా అలా నాలుగు రకాలు కనపడటంతో త్రాగుడు పూర్తిగా మాని వేశాడు. ఇదే సమయమని భర్త తెచ్చిన డబ్బును జాగ్రత్తగా దాచింది సుమతి.
మనిషి తలచుకుంటే చేయలేనిదేదీ వుండ దని ఉడుంపట్టు పట్టాడు శీనయ్య. చాలా డబ్బు పోగేశారు కూడా.
కొద్దికాలం తర్వాత మేడకు పునాదులు త్రవ్వి అనతికాలంలోనే అద్దాలమేడ నిర్మించి అన్నంత పని చేసి చూపించారు. బంధువు లందరినీ పిలిచి గర్వంగా గృహప్రవేశం చేశారు. వారు పిల్లాపాపలు ఆనందంగా జీవనం సాగిస్తున్నారు.
ఒకరోజు సాధువు వచ్చాడు. శీనయ్య ఇల్లును చూచి ముక్కున వేలుంచుకున్నాడు. అంతలో దంపతులు ఆయన కాళ్ళపై బడి నమస్కరించి తమ దయవల్ల, అమ్మ ఆశ్వీర్వాదం వల్ల అద్దాల మేడను కట్టుకున్నాము. ఏమిచ్చి మీరుణం తీర్చు కోగలము? అన్నారు.
సాధువు ముసిముసిగా నవ్వుతూ ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అంతా నీ భార్య గొప్పతనమే. ఒక రోజు నాదగ్గరకు వచ్చి నీ సంగతంతా చెప్పి ఏడ్చింది. మార్పురావాలని నీలో ప్రేరణ కలగాలని, చూచాయగా అలా అన్నాను. అది మనసులో వుంచుకుని నిజంగానే అద్దాల మేడను నిర్మించుకున్నావు. క్రమశిక్షణ, పట్టుదల అలవరుచుకుంటే ఎంతటి కార్యమైన అవలీలగా సాధించవచ్చు అని నిరూపించావు. నీ సంసారం సుఖంగా వుంది. అంతకు మించి నాకేం కావాలి. నిన్నుచూచి నీలో వచ్చిన మార్పు ను గమనించి మిగిలిన త్రాగు బోతులు మారితే, మన సమాజమే నందనవనమౌతుంది. మంచి మానవత్వం అను పూలుపూచి ప్రేమ దయ, కరుణ అనే సువాసనలు ఇచ్చిన వాడు నాకు నిజమైన ఆనందం కలుగుతుంది, అంటూ నాలు గు గింజలు తీసుకుని తన దారిన వెళ్ళి పోయాడు సాధువు. కృతజ్ఞతతో సాధువు నడచి పోయిన పాద ముద్రలకు నమస్కరించారు దంపతులు.

జంజం కోదండరామయ్య, జమ్మిపాళెము

