-చిట్వేల్ పట్టణం ప్రధాన రహదారిలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గుంతలు
చిట్వేల్, అక్టోబర్ 18 (ఎల్లో సింగం ప్రతినిధి)
చిట్వేల్ మండలం లో గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో పట్టణంలోని ప్రధాన రహదారులు మళ్లీ గుంతల బారిన పడ్డాయి. గత సంవత్సరం పూడ్చిన గోతులు తిరిగి తెరుచుకుని వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి.
ప్రత్యేకంగా వై.ఎస్.ఆర్ సర్కిల్ వద్ద, కొత్త బస్టాండు సమీపంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు వద్ద, ఎన్.టి.ఆర్ విగ్రహం వద్ద ఇలా పలు ప్రదేశాల్లో రహదారి దెబ్బతింది. గతంలో అనేక సార్లు వార్తా పత్రికల్లో ప్రచురితమైనప్పటికీ, తాత్కాలిక పూడికతోనే పని ముగిసింది.ఇప్పటికే వై.ఎస్.ఆర్ సర్కిల్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఈ గుంతల్లో జారి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ప్రమాదాలు మరింత పెరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్రధాన రహదారిలో ఏర్పడిన గోతులకు అతుకులు వేసి, ప్రజల ప్రాణాలను కాపాడాలని చిట్వేల్ ప్రజలు కోరుతున్నారు.


