అక్టోబర్ చేజర్ల. పున్నమి ప్రతినిధి
*అవస్థలు పడుతున్న భక్తులు, ప్రజలు*
*గతంలో తూతూ మంత్రంగా గుంతలకు ప్యాచ్ మరమ్మతులు*
*ప్యాచీలు వేసిన కొద్ది రోజులకే బయటపడ్డ గుంతలు, బురదమయంగా మారిన రోడ్డు*
*కనీస ప్రభుత్వ నాణ్యత తారుణి కూడా ఉపయోగించకుండా, సక్రమమైన పద్దతిలో మరమ్మతులు చేపట్టలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు*
*తక్షణమే ప్రభుత్వ నాణ్యత తారుణి, కంకరుని ఉపయోగించి మరమ్మతులు చేపట్టాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు*
*డబుల్ లేన్ రోడ్డు వేయాలంటూ ప్రజల వేడుకోలు*
(నెల్లూరు–పెంచలకోన) : ఆదూరుపల్లి నుంచి కొలపనాయుడు పల్లి, దాచూరు మీదుగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయానికి వెళ్ళే రహదారి నరక దారిగా మారుతుంది. ఆ దారి మీద వెళ్లాలంటే అమ్మో ఆ రోడ్డుపై ప్రయాణించడం కష్టమేనని వాహనచోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి రహదారులను చూసి ప్రయాణిస్తున్న ప్రజలు ఈ రహదారి అడుగుకో గుంత… అతుకుల బొంతగా మారిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆదూరుపల్లి నుంచి గోనుపల్లి వరకు రహదారి అంతా గుంతలతో దారుణ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రహదారి గుండా ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్ళే భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఏర్పడిన గుంతలకు ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్యాచ్ ల పనులతో మరమ్మత్తులు చేపట్టారు… కానీ ఒప్పంద కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగా చిన్నచిన్న ప్యాచ్ వర్క్ లు చేసి, కనీస ప్రభుత్వ నాణ్యత గల తారు కూడా ఉపయోగించలేదని, వారు వేసిన ప్యాచీలు చిన్నపాటి వర్షానికే తారంతా కొట్టుకుపోయి, రోడ్డంతా బురద మయంగా మారింది, వాహన చోదకులు ఆ బురదలో చిక్కుకుని కుయ్యో మొర్రో ఇవేం ప్యాచీలయ్యా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు… ప్యాచీలు వేసిన కొద్ది రోజులకే మళ్లీ గుంతలు బయటపడడమే కాకుండా సక్రమమైన పద్దతిలో మరమ్మతులు చేపట్టలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రతిరోజూ భక్తులు ఈ మార్గం ద్వారా పెంచలకోన దేవాలయం, వాటర్ ఫాల్స్ సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు వెళ్తుంటారని ప్రజలు అంటున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో రహదారిపై మట్టి, జారుడు పరిస్థితులు ఏర్పడి ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. నెల్లూరు నుంచి పెంచలకోనకు వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి గుండానే వెళ్లాల్సి ఉంది. అయితే ఈ రహదారి మార్గాన వెళ్ళే కార్లుతో పాటు ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బందులు పడడమే కాకుండా వాహనాలు కూడా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్యాచ్ ల పనుల కంటే ఆ గుంతలే నయం అన్నట్లుగా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, పెంచలకోనకు వెళ్ళే రహదారి అయిన ఆదూరుపల్లి నుంచి గోనుపల్లి వరకు తక్షణమే ప్రభుత్వ నాణ్యత తారుని, కంకరని ఉపయోగించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. అలాగే డబుల్ లేన్ రోడ్డు వేస్తే భక్తులతో పాటు ప్రజలు ఆ రహదారిన వెళ్ళే వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చని భక్తులు, ప్రజలు కోరుతున్నారు.


