ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం నగరంలో అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన స్మృతికి నివాళి అర్పిస్తూ అటల్ బిహారీ వాజ్‌పేయి ఉత్సవ కమిటీ అధ్యక్షులు దుద్దుకూరు వెంకటేశ్వరరావు అధ్యక్షతన స్థానిక కార్యాలయంలో శుక్రవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దుద్దుకూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అటల్ జీ మహోన్నత వ్యక్తిత్వం, సిద్ధాంతాలు, ఆదర్శాలు నేటి తరానికి స్ఫూర్తినివ్వాలని, సమాజంలో విలువలతో కూడిన రాజకీయ అవసరాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ ఉత్సవాల లక్ష్యమన్నారు. మార్చి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక ఎస్.ఆర్. గార్డెన్స్‌లో “అటల్ జీ కి అక్షర నిరాజనం” పేరుతో కవితా సంకలనాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు.
అలాగే ఈ సభకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచందర్ రావు, మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ తదితరులు పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్వాగత కమిటీ అధ్యక్షుడిగా కాటమనేని రమేష్ వ్యవహరించనున్నారు.
ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మందడపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అజాతశత్రువుగా పేరుగాంచిన అటల్ జీకి నివాళి అర్పించేందుకు జాతీయవాదులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సభలో కవి పండితులకు సన్మానం, “ఘనమైన మన ఖమ్మం” నృత్యరూపకం, అటల్ జీకి నివాళి గేయం ఆవిష్కరణతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, వడ్లమూడి సురేష్, కోశాధికారి మల్లెంపాటి రమేష్, కార్యదర్శులు యాలగందుల మధు, పోతుల చంద్రశేఖర్, తవిడబోయిన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



