అక్రమ కేసుతో పైశాచిక ఆనందం
-రెడ్ బుక్ పాలనకు భయపడం
-వైసిపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి
సిద్దవటం జూలై 21
అక్రమ కేసులతో వైఎస్ఆర్సిపి నాయకులను వేధిస్తూ కూటమి నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని వైయస్సార్సీపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి మండిపడ్డారు.సిద్ధవటంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్ద రెడ్డి మిధున్ రెడ్డి అక్రమ అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.40 గా పెద్ద రెడ్డి కుటుంబం రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తుందన్నారు. అలాంటి కుటుంబంపై మద్యం కుంభకోణంలో వారి పాత్ర ఉందంటూ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. పెద్దిరెడ్డిపై కక్షసాన్నిపులకు చంద్రబాబు కుటీల ప్రయత్నాల్లో భాగమే మిథున్ రెడ్డి అరెస్ట్ అన్నారు.జగనన్న పాలనలో అవినీతికి తావు లేకుండా మద్యం అమ్మకాలు జరిపి ప్రభుత్వ ఆదాయం పెంచారని గుర్తు చేశారు.కేవలం రాజకీయ వేధింపుల్లో భాగంగా లేని అంశాన్ని భూతద్దంలో చూపి అరెస్టులు చేస్తుండటం పైశాచిక పాలనకు నిదర్శనం అన్నారు. వారి మాట వినని వారిని సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి బలవంతపు వాంగ్మూలాలు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు.మీ అరెస్టులతో వైసిపి శ్రేణులు భయపడే ప్రసక్తే లేదన్నారు.40 ఏళ్ళ నుంచి చంద్రబాబు పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారని,అయితే పెద్దిరెడ్డి కుటుంబం ప్రజా దీవెనలతో ప్రజా క్షేత్రంలో ఎన్నడూ ఓటమి చవి చూడలేదన్నారు.ఆయన ఎదుగుదలను ఓర్వలేక అక్రమ కేసులతో అరెస్టులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.అధికారం శాశ్వతం కాదని కూటమి నాయకులు గుర్తుపెట్టుకోవాలని ఆమె హెచ్చరించారు.


