అక్రమ ఇసుక రవాణ లారీ సీజ్
అశ్వారావుపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు
పున్నమి ప్రతినిధి – 12నవంబర్2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండల రిపోర్టర్
అశ్వారావుపేట మండల పరిధిలో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న టిప్పర్ లారీని పోలీసులు సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతున్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ యయాతి రాజు నేతృత్వంలో సిబ్బంది రహదారి వెంట వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సోమవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఊట్లపల్లి సెంటర్ వద్ద ఒక టిప్పర్ లారీ అనుమానాస్పదంగా కనిపించింది.
పోలీసులు ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా లారీలో పెద్ద మొత్తంలో ఇసుక లోడు చేసి ఉన్నట్లు గుర్తించారు. తదుపరి విచారణలో ఆ లారీ ఆంధ్ర రాష్ట్రంలోని కొవ్వూరు ప్రాంతం నుండి తెలంగాణ రాష్ట్రం దమ్మపేట మండలానికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు తేలింది. డ్రైవర్ నుండి పోలీసులు వివరాలు సేకరించి, వాహనాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనపై ఎస్సై యయాతి రాజు మాట్లాడుతూ, అక్రమ ఇసుక రవాణాపై ఎటువంటి రాజీ లేకుండా చర్యలు కొనసాగుతాయి. ప్రజలు కూడా ఈ రకమైన అక్రమ రవాణాలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అక్రమ ఇసుక రవాణకు పాల్పడుతున్న వారిపై మరింత లోతైన దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు.


