అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి)
మరో కొత్త నెల ప్రారంభమైంది. అక్టోబర్ వచ్చేసింది. ప్రతి నెలా కొన్ని నిబంధనలు మారుతూ ఉంటాయి. కొత్తగా అమలులోకి వస్తున్న మార్పులు మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేయడం తప్పదు. ఈ రోజు, అక్టోబర్ 1, 2025 నుండి కొన్ని ముఖ్యమైన కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
మొదటిగా, రైల్వే శాఖ తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం, జనరల్ టికెట్‌ల బుకింగ్ కోసం మొదటి 15 నిమిషాల్లో కేవలం “ఆధార్” ధృవీకరణ ఉన్న ఖాతాల నుంచే టికెట్లు బుక్ చేయగలుగుతారు. ఇది టికెట్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్య.
రెండవది, ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో మార్పులు. డబ్బుతో ఆడే గేమ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కొత్త నియంత్రణలు తీసుకొచ్చింది. గేమింగ్ సంస్థలు, ప్రచారదారులు మరియు చెల్లింపుల వ్యవస్థలపై కఠిన నిబంధనలు అమలవుతాయి.
మూడవది, పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ (PFRDA) NPS పథకంలో కొత్త ఎంపికలు అందిస్తోంది. ఈక్విటీ పెట్టుబడుల్లో 100% వరకు వెళ్ళే అవకాశం, స్కీమ్‌ల మధ్య మార్పులు చేసే సౌలభ్యం లభించనుంది.
నాలుగోవది: గ్యాస్ సిలిండర్ ధరలు
ప్రతి నెల చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తుంటాయి. ఇంట్లో వాడుకునే సిలిండర్ ధరలు చాలా కాలం నుంచి స్థిరంగానే ఉన్నాయి. ఈ నెలలో కూడా వాటి ధరల విషయంలో మార్పు లేదు. అయితే 19 కిలోల వాణిజ్య సిలిండర్‌లపై మాత్రం చమురు కంపెనీలు రూ.15 పెంచాయి.
అదేవిధంగా, ఇండియా పోస్టల్ శాఖ “స్పీడ్ పోస్ట్” సేవల్లో OTP ఆధారిత డెలివరీ విధానాన్ని ప్రారంభిస్తోంది.
ఈ మార్పులు మన ఆర్థిక, ప్రయాణ, డిజిటల్ జీవన విధానంలో ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి.


