పి జె ఆర్ ఎస్ లో ప్రజా, దళిత సంఘాల నేతలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు
పెందుర్తి మండలం, చిన ముషిడి వాడ అంబేడ్కర్ నగర్ సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన రెవెన్యూ సిబ్బంది, ఆదేశాలిచ్చిన ఆర్డీవో శ్రీలేఖ, ఎమ్మార్వోలపై చర్యలు తీసుకోవాలని ప్రజా దళిత మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు వినతిపత్రం ద్వారా ఫిర్యాదు చేశారు.
అనంతరం పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం లక్ష్మీ మీడియాతో మాట్లాడుతూ 20ఏళ్ల క్రితం నుండి అంబేద్కర్ విగ్రహం ఉందని, అక్కడ ప్రభుత్వం బోరింగు కూడా ఏర్పాటు చేసిందని అంబేద్కర్ విగ్రహం బోరింగ్ ఉన్న స్థలాన్ని వి.ఎం.ఆర్.డి.ఏ అమ్మితే దానిని కొనుగోలు చేశారని, కానీ ఇప్పుడు కొత్తగా విగ్రహం పెట్టారని అవాస్తవాలతో చందక సాయి కృష్ణ కోర్టులో పిటిషన్ వేశారన్నారు.
ఆ పిటిషన్ పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేయమని విశాఖ జిల్లా కలెక్టర్ కి 2021లో కోర్టు డైరెక్షన్ ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఇది కోర్టులో పెండింగ్లో ఉందని, కానీ విగ్రహం తొలగించమని ఆదేశాలు ఇచ్చినట్టు పిటిషన్ దారుడు చందక సాయి కృష్ణ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని ఆమె చెప్పారు.
వాస్తవానికి అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2021 లోనే పెందుర్తి తాసిల్దార్ రామారావు విచారణ జరిపి ఆ స్థలంలో అప్పటికే 15 సంవత్సరాల క్రితం నుండి అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉందని, అక్కడ ప్రభుత్వ నిధులతోనే బోరింగ్ కూడా ఏర్పాటు చేయబడిందని ఆ సందర్భంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ స్థలము తమదని క్లైమ్ చేయలేదని జిల్లా కలెక్టర్కు గ్రౌండ్ రిపోర్టు ద్వారా తెలియజేశారని ఆమె వివరించారు.
కానీ ఆర్డీవో శ్రీలేఖ ఈ విషయాలు ఏమీ పరిగణలోకి తీసుకోకుండా, తమ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న ఫైలుని కనీసం చూడకుండా పెందుర్తి ఎంఆర్ఓని అక్కడున్న సిబ్బందిని తన తప్పుడు ఆదేశాలతో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడానికి పురమాయించిందని తెలిపారు. దీనిపై తాము జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా ఆర్డీవో శ్రీలేఖ పైన రెవెన్యూ సిబ్బందిపైన తగు చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు ఆమె వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో లక్ష్మీ తో పాటు, దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్ సుర్ల వెంకటరమణ, పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి ఇందిర, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బి రామకృష్ణ, భారత నాస్తిక సమాజం వై నూకరాజు, ఐ యఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి రావు, మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం పూర్వ అధ్యక్షులు కే రవి నగర కన్వీనర్ ఈసర లక్ష్మి, కో కన్వీనర్ రూప, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కే నిర్మల, దళిత విముక్తి నాయకులు బంకపల్లి అప్పారావు సన్యాసమ్మ తదితరులు ఉన్నారు.


