

విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వివిధ దేశాల నుంచి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం ఇంజినీరింగ్ కళాశాల గౌతమ్ బుద్ధ-బి.ఆర్.అంబేద్కర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగా ప్రవేశం పొందిన సుమారు 300 మంది అంతర్జాతీయ విద్యార్థులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ICCR బెంగళూరు జోనల్ డైరెక్టర్ శ్రీ పరదీప్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశం అనేక దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ, నాణ్యమైన విద్యను విదేశీ విద్యార్థులకు అందించడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించాలంటూ సూచించారు. అలాగే, స్కాలర్షిప్ నియమాలు మరియు ఇతర వివరాలను విద్యార్థులకు వివరించారు.
విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ మరియు అంతర్జాతీయ వ్యవహారాల ఇన్‌చార్జి డీన్ ప్రొఫెసర్ కె. రాంబాబు మాట్లాడుతూ, విద్యార్థులు తరగతి గదులకు మాత్రమే పరిమితం కాకుండా స్టార్టప్‌లు, ఇంక్యుబేషన్ వంటి రంగాలలో అవకాశాలను అన్వేషించాలన్నారు. శతాబ్ద చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాణ్యమైన విద్యా విలువలతో ముందుకు సాగుతోందన్నారు.
అంతర్జాతీయ వ్యవహారాల అసోసియేట్ డీన్ మరియు విద్యార్థి వసతి గృహాల చీఫ్ వార్డెన్ ఆచార్య ఎన్.ఎం. యుగంధర్ మాట్లాడుతూ, విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో కలిసిమెలిసి ఉండాలని, పరస్పర గౌరవ భావన కలిగి ఉండాలని సూచించారు. వర్సిటీ పరంగా అవసరమైన అన్ని సహకారాన్ని అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఆచార్యులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

