విశాఖపట్నం, అక్టోబర్ 3:
ప్రజ్ఞశ్రీ డా. బండి సత్యనారాయణ రచించిన “అండమాన్ చూద్దాం రండి” (యాత్రా కథనం) పుస్తకాన్ని పద్మభూషణ్, గౌరవ రాజ్యసభ మాజీ సభ్యులు, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగం సెమినార్ హాల్‌లో ఆవిష్కరించారు.
యమ్. శశిరాణి పాడిన దేశభక్తి గీతం “జయ జయ ప్రియ భారత”తో సభ ప్రారంభమైంది. మేడా మస్తాన్ రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు.
పుస్తకావిష్కర్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ – 1996లో పోర్ట్‌బ్లెయిర్ సందర్శించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. కవి అయిన బండి సత్యనారాయణ యాత్రా కథనం రచించడం విశేషమని ప్రశంసించారు. రచనల్లోని శక్తివైభవాన్ని, పుస్తక ముద్రణలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.
కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు పుస్తకాన్ని సమీక్షిస్తూ – అండమాన్ చరిత్ర, సంస్కృతి, కాలాపాని జైలు, సునామీ నష్టం వంటి అంశాలను వివరించారని, రచయిత పరిశీలనా శక్తి ప్రతిబింబించిందని అభినందించారు.
గౌరవ అతిథి నల్లా అపర్ణ (సెంట్రల్ ఎక్సైజ్ అధికారిణి) తన భర్త అండమాన్‌లో పనిచేస్తున్నందున ఈ పుస్తకం ప్రత్యేక అనుభూతిని కలిగించిందని తెలిపారు. తొలి ప్రతిని సి. సుబ్బారావు (డెప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ & ఆకాశవాణి) స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ – బండి రచనలు ఎల్లప్పుడూ సరళంగా, ఉపయోగకరంగా ఉంటాయని అభినందించారు.
రచయిత డా. బండి సత్యనారాయణ సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అందించిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మార్టూరు శ్రీనివాసరావు, ఉప్పల అప్పలరాజు, డా. కె.వి.యస్. హనుమంతరావు, సిహెచ్. చిన సూర్యనారాయణ, మరడాన సుబ్బారావు, స్వర్ణ శైలజ, పి.యల్.వి. ప్రసాద్, శీరేల సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.


