అనకాపల్లి, అక్టోబర్ 31:
దేశ సమైక్యతకు, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివాస్) అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన రావు పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ—
సర్దార్ పటేల్ దేశ ఐక్యతకు, సమగ్రతకు చేసిన సేవలు చిరస్మరణీయమని, అనేక రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్లో విలీనం చేయడం ద్వారా ఆయన నిజమైన జాతీయ నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు. పటేల్ చూపిన దేశభక్తి, ఐక్యతా దృక్పథం ప్రతి భారతీయునికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
తరువాత పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి దేశ ఐకమత్యం, భద్రతను కాపాడేందుకు అంకితభావంతో పనిచేయాలని, ఈ సందేశాన్ని ప్రజల్లో విస్తరింపజేయాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, లక్ష్మీ, రమేష్, మన్మధరావు, ఎస్సైలు రమణయ్య, ప్రసాద్, సత్యనారాయణతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


