
కళ్లు మనకు దేవుడిచ్చిన అపురూపమైన నిధని, వాటిని కాపాడుకోవలసిన బాధ్యతని మనదేనని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డా.పైడి.సింధూర అన్నారు. స్థానిక కెఎల్ నాయుడు కంటి వైద్యశాలలో, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రముఖ కంటివైద్య నిపుణులు కెఎల్ నాయుడు సహకారంతో కంటి రోగులకు ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించి, అవసరమైన రోగులకు ఉచిత మందులను అందించారు.
ఈ సందర్భంగా లయన్ డా.పైడి.సింధూర, వైద్యనిపుణులు కెఎల్ నాయుడు మాట్లాడుతూ కంటి సంరక్షణ జాగ్రత్తగా కాపాడుకోవడం మన విధని, మనం ప్రతీ వస్తువును చూడాలన్నా కళ్లు చాలా అవసరమని తెలిసినా, చాలా మంది కళ్ల విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటారన్నారు. కంటి నుంచి నీరు కారినప్పుడో.. తలనొప్పిగా ఉన్నప్పుడో.. మామూలు అద్దాల దుకాణానికి వెళ్లి పరీక్షలు చేయించుకోకుండానే కంటి అద్దాలు వాడుతుంటారని, కళ్లను మనం జాగ్రత్తగా చూడకపోతే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అవగాహన కల్పించందుకు ప్రతి ఏటా అక్టోబర్ రెండో గురువారం నాడు ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’ ను నిర్వహిస్తున్నారన్నారు. అంధత్వ సమస్యలపై ప్రజలను జాగృతం చేసి వీలున్నంత మందికి మెరుగైన కంటిచూపును అందించడమే ఈ ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’ ప్రత్యేకతని, ప్రజలకు కంటి సమస్యలను దూరం చేయాలన్న సదుద్దేశంతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు ఇవ్వడం, సర్జరీలు చేయడం, మందులు ఇవ్వడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.
జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ. రవి కుమార్, మెంటార్ నటుకుల. మోహన్ మాట్లాడుతూ కంటి చూపును మంచిగా ఉంచే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలని, ఏ విటమిన్‌తో పాటు బీటారెరోటిన్ అధికంగా లభించే క్యారెట్లు నిత్యం తినేలా చూసుకోవాలని, గుడ్లు, బీన్స్, నారింజ పండ్లు, బొప్పాయి, బాదాం ఎక్కువగా తినాలని, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ లభించే చేపలను ఎక్కువగా తినాలన్నారు. కళ్లు ఆరోగ్యం ఉంచడంలో నట్స్ కీలక పాత్ర పోషిస్తాయని, వాల్నట్స్, బాదం, పిస్తా వంటి నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ ఉంటాయి. ఇవి మీ కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం. రామ్ గోపాల్, సభ్యులు రామ్ మోహన్, పైడి. ప్రదీప్ కుమార్, సింధూర వైద్యశాల సిబ్బంది, కెఎల్ నాయుడు కంటి వైద్యశాల సిబ్బంది, కంటి వ్యాధిగ్రస్థులు తదితరులు పాల్గొన్నారు.

