తిరుమల, 2026 మార్చి 21 పున్నమి ప్రతినిధి
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు తన సతీమణి శ్రీమతి భువనేశ్వరి, కుమారుడు మరియు మంత్రి శ్రీ లోకేష్ లతో కలిసి తన మనవడు చిరంజీవి నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా గౌ|| ముఖ్యమంత్రివర్యులు ఆలయంలోకి ప్రవేశించారు.
మహద్వారం వద్దకు చేరుకోగానే అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్షణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగనరసింహస్వామివారిని దర్శించుకుని హుండిలో కానుకలు సమర్పించారు.
శ్రీవారిని దర్శించుకున్న గౌ|| ముఖ్యమంత్రివర్యులకు స్వామివారి శేష వస్త్రాన్ని అందించారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా గౌ|| ముఖ్యమంత్రివర్యులకు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలు, శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, పరాభవ నామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను చైర్మన్, ఈవోలు అందించారు.
ఈ కార్యక్రమంలో పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా అధికారులు, టీటీడీ జేఈవోలు శ్రీ వీరబ్రహ్మం, డాక్టర్ శరత్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
———————————
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.












