డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ, సెప్టెంబర్ 30
అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన విషాదకర బాణాసంచా పేలుడు ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గ్రామంలోని ఓ కిరాణా షాపులో జరిగిన పేలుడులో కంచర్ల శ్రీనివాసరావు, సీత దంపతులు మృతి చెందిన విషయం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఈ విషాద ఘటన బాధాకరమని, వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. పేలుడులో గాయపడిన వారి కుమారుడు ప్రదీప్‌కు అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. తాను హైదరాబాదులో ఉన్నప్పటికీ, ప్రమాద వార్త తెలియగానే వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబానికి అండగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.


