భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో సంక్రాంతి పండుగ సంబురాలను పురస్కరించుకుని పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డీ పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు.
ముగ్గుల పోటీలకు వేలాది సంఖ్యలో తరలివచ్చిన ఆడబిడ్డలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ తమ ఇంటి కుటుంబ సభ్యుల్లా భావిస్తూ హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షించారు.
సంక్రాంతి పండుగ రైతన్న ఇంట పంట చేరే సందర్భంలో ఆనందాన్ని తీసుకొస్తుందని, అందుకే పల్లెల్లో ఈ పండుగను అందరూ సంతోషంగా ఘనంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆడబిడ్డలు వేసిన ముగ్గుల్లో విభిన్న పద్ధతులు, సంస్కృతులు, ఆచారాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు శ్రేయస్కరమైన సందేశాలు ప్రతిబింబించేలా కళాత్మకంగా ఆకట్టుకున్నాయని అన్నారు. ఆ ముగ్గులను చూస్తే ఆడబిడ్డల శక్తి, సృజనాత్మకత స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి గారు, శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు, ఆదినారాయణ గారు, కొత్తగూడెం డీసీసీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్న గారు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



