సింహాచలం తొలి పావంచ నుండి పాత అడవివరం వరకు బి.ఆర్.టి.ఎస్ ప్రాజెక్టుతో నష్టపోయిన బాధితుల సమస్యలు చివరకు పరిష్కారం దిశగా వెళ్లాయి. రెండు సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని సరిదిద్దుతూ, ప్రస్తుత ప్రభుత్వం బాధితులకు టిడిఆర్లు మంజూరు చేసింది.
బాధితుల తరఫున పాశర్ల ప్రసాద్, మాజీ సర్పంచ్ అడవివరం, కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
ఆయన మాట్లాడుతూ—
“బి.ఆర్.టి.ఎస్ పేరుతో మా ఇళ్లు, భూములు తీసుకునిపోయినా, అప్పటి ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఇప్పటి ప్రభుత్వం మా మాట విని, మా సమస్య పరిష్కరించింది. మా కుటుంబాలకు ఇది పెద్ద ఉపశమనం” అని తెలిపారు.
ఈ నిర్ణయం తీసుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, నారా లోకేష్, పట్టణాభివృద్ధి మంత్రి పి. నారాయణ, విశాఖ పార్లమెంటు సభ్యుడు మతుకుమిల్లి భరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిసి కీలక పాత్ర పోషించారు.
టిడిఆర్లు మంజూరైన వార్తతో అడవివరం, పాత అడవివరం, సింహాచలం పరిసర ప్రాంతాల్లో ఆనందం వెల్లివిరిసింది. బి.ఆర్.టి.ఎస్ బాధితుల దీర్ఘకాల పోరాటానికి ఇది న్యాయవిజయం గా భావిస్తున్నారు.


