ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రభుత్వ ఆరోగ్య సేవలను సాంకేతిక ఆధారిత (డిజిటల్) విధానంలో ప్రజలకు చేరువ చేస్తామని చెప్పారు.
సీఎస్ఆర్ కింద ఎన్టీపీసీ సంస్థ రూ.2 కోట్ల ఆర్థిక సహాయంతో కింగ్ జార్జ్ ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగంలో ఆధునికీకరించిన హీమో డయాలసిస్ యూనిట్‌ను మంత్రి బుధవారం పునఃప్రారంభించారు. అనంతరం యూనిట్‌లోని సదుపాయాలను పరిశీలించి, రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
తరువాత మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని, అందులో భాగంగా రూ.25 లక్షల విలువైన సార్వత్రిక ఆరోగ్య బీమా పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపారు. కుప్పంలో ‘సంజీవని’ పేరుతో పైలట్ ప్రాజెక్టు అమలవుతోందని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ డిజిటల్ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగంలో ప్రస్తుతం 13 ఉపయూనిట్లు సేవలందిస్తున్నాయని, ఎన్టీపీసీ సాయంతో మరిన్ని 10 కొత్త యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సమగ్ర వైద్య సదుపాయాలు కల్పించామని, పేదలకు ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా మెరుగైన వైద్య సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్, ఏఎంసీ పూర్వ విద్యార్థుల సంఘం ఛైర్మన్ డా. రవిరాజు, ప్రిన్సిపాల్ డా. కేవీఎస్ సంధ్యాదేవి, కేజీహెచ్ నిర్వాహకుడు బీవీ రమణ, సూపరింటెండెంట్ డా. ఐ.వాణి, ఆర్ఎంవో డా. శ్రీహరి, నెఫ్రాలజీ విభాగాధిపతి డా. రత్నప్రభ, ఎన్టీపీసీ ప్రతినిధులు పాత్రో, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.


