ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి)
మధిర పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మధిరలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించిన పట్టణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “అభివృద్ధి – సంక్షేమం – నమ్మకం” ఈ మూడు అంశాల సమ్మేళనమే మధిర విజయానికి కారణమని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు భారీ విజయం
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లభించిన విజయం చారిత్రాత్మకమని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు ఇంత భారీ మెజార్టీ లభించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 90–95 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని తెలిపారు. గ్రామాల్లోనే కాదు పట్టణాల్లోనూ కాంగ్రెస్ బలంగా ఉందని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి ఏకపక్ష విజయం అందించిన ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం రేవంత్ నేతృత్వంలో అభివృద్ధి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం సమిష్టిగా కృషి చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వం మరింత బాధ్యతగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి పట్టణ ప్రజల రుణం తీర్చుకుంటామని స్పష్టం చేశారు.
2047 లక్ష్యం – 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగాల కల్పనకు పారిశ్రామికరణ, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
మధిరను మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతాం
మధిరను మోడల్ పట్టణంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. “నో పాలిటిక్స్.. ఓన్లీ డెవలప్మెంట్” అనే నినాదంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు నమ్మి ఓట్లు వేసినందుకు తాము మరింత బాధ్యతగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.



