నందిగామ పట్టణంలో గత 125 సంవత్సరాలుగా అనాదిగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడుతున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఈ ఏడాది మరింత వైభవంగా సాగాయి. నందిగామ ముక్కోటి మహా మండపంలో నిర్వహించిన 126వ వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మున్సిపల్ చైర్పర్సన్ మండల కృష్ణకుమారి, వార్డు కౌన్సిలర్లు, కూటమి నేతలతో కలిసి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
శతాబ్ద కాలంగా దివి రత్నమాచార్యుల వారి కుటుంబం ఈ పవిత్ర మహోత్సవాలను నిర్విఘ్నంగా నిర్వహిస్తూ రావడం విశేషం. ఈ ఉత్సవాలు లింక్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించు కోవడం నందిగామ పట్టణానికి, అలాగే ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న కుటుంబానికి గర్వకారణంగా నిలిచింది.
కళలు, సంస్కృతి, ఆచారాలు, వైభవాలకు నిలయమైన ముక్కోటి మహా మండపంలో భక్తి సంగీతం, వేదపఠనం, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. పలువురు మహానుభావులు తమ కళా ప్రదర్శనలతో వేదికను ఆధ్యాత్మిక శోభతో నింపారు.
నందిగామకు క్షేత్ర బిందువుగా నిలుస్తున్న ముక్కోటి మహా మండపం, ఈ మహోత్సవాల ద్వారా పట్టణానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తోందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉన్న 63 పుణ్యక్షేత్రాల విశేషాలను వివరిస్తూ కెవిఆర్ కళాశాల తెలుగు విశ్రాంత ఉపాధ్యాయులు రవి ప్రసాద్ రచించిన ‘దివ్య క్షేత్రాలు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.
ఈ మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు, కూటమి నేతలు, కళాకారులు, భక్తులు, ప్రజలందరికీ ఆమె పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నందిగామలో కొనసాగుతున్న ఈ శతాబ్దాల సంప్రదాయం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు.



