దొంగే దొంగా… దొంగా అంటే ఎలా?
చర్చా వేదికలో వక్తల ఆవేదన
నెల్లూరు, జనవరి 4, (పున్నమి ప్రతినిధి) : తెలుగు భాషను కూనీ చేసేందుకు అహర్నిశలు శ్రమించిన పాలకులు దొంగే… దొంగా దొంగా అని అరిచినట్లు తెలుగు భాషపై చవితి ప్రేమ చూపిస్తున్నారని పలువురు మేధావులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నెల్లూరు నగరంలోని పున్నమి తెలుగు దినపత్రిక కార్యాలయంలో రాష్ట్రంలో తెలుగు మాధ్యమం రద్దు – ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం పై చర్చా వేదిక నిర్వహించారు.
ఈ చర్చా వేదికలో తెలుగు భాషను కూనీ చేసేందుకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన పలు జీవోలను ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు సుబ్బారెడ్డి వివరించారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పటి ఉపరాష్ట్రపతి, ఒకప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలుగు భాషను కనుమరుగు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారని ఆయన వివరించారు. అయితే ఇప్పుడు తెలుగు భాషకు నష్టం జరుగుతుందని వారే గొంతెత్తి అరవడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. తాము అధికారంలో వున్నప్పుడు రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియాను ప్రవేశపెట్టింది చంద్రబాబు ప్రభుత్వమే తీసుకొచ్చారని, అయితే ఇప్పుడు తెలుగు భాషకు ఏదో నష్టం జరిగిపోతుందని గగ్గోలు పెట్టడంలో ఆయన కూడా వుండడం దురదృష్టకరమన్నారు.
రాష్ట్రంలో తెలుగు భాషను కాపాడుకునేందుకు పలువురు మేధావులు, ప్రజాసంఘాలు ఎంతో చిత్తశుద్దితో ఉద్యమాన్ని చేస్తున్నా చంద్రబాబునాయుడు లాంటి వారు కూడా భాష పరిరక్షణ పై మాట్లాడడం రాజకీయ రంగు పులుముకుంటుందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఒకప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు కూడా తెలుగు మాధ్యమాన్ని ఒక పద్ధతి ప్రకారం కూనీ చేస్తున్నారన్నారు. వీరిద్దరూ రెండు పార్టీలకు చెందిన నాయకులే అయినప్పటికి ఏ ఒక్కరూ కూడా చిత్తశుద్ది లేనివారేనని, అలాంటి వారి మాయమాటలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. దేశంలోనేగాక, ప్రపంచంలోనే మాతృభాషకు ఎంతో ప్రాధాన్యత వుందని, మాతృభాషలోనే భావిభారత పౌరుల అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు.
కేవలం ఆంగ్లంతోనే అభివృద్ధి అని చెప్పడం మూర్ఖత్వమన్నారు. ప్రాధమిక విద్య మొత్తం మాతృభాషలోనే జరగాలని, ఆంగ్ల భాషను బలవంతంగా రుద్దడం సరియైనదని కాదన్నారు. పున్నమి మాసపత్రిక గౌరవ సంపాదకులు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ మాట్లాడుతూ విదేశాలలో కూడా తమ మాతృభాషను గౌరవించే సంస్కృతి ఉందన్నారు. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో మాతృభాషను కనుమరుగు చేసేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారన్నారు.
దేశవిదేశాలకు వెళ్లాలంటే ఆంగ్లం తప్పనిసరి అని వాదించే వారు ఎంత మంది విదేశాలకు వెళుతున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో అయిదుకోట్ల జనాభావుంటే కనీసం పది శాతం మంది కుటుంబీకులు కూడా విదేశాలకు వెళ్లే అవకాశం వుండదని, అలాంటి పరిస్థితుల్లో అందరి పై బలవంతంగా ఆంగ్ల భాషను రుద్దడం బాధాకరమన్నారు. ఖచ్చితంగా పదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన వుండాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పున్నమి పత్రిక సంపాదకులు సర్వేపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ పల్లెల్లో నేటికి ఎందరో ఉన్నత విద్యకు దూరంగా వున్నారని అలాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం వుందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలతో పాటు ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతులు ప్రభుత్వపాలకులుగా చెలామణి అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వపాఠశాలలు కనుమరుగై ప్రైవేటు విద్య విలయతాండవం చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి పేద వర్గాలకు ఉన్నత విద్యను అందించాల్సిన అవసరం వుందన్నారు. ఈ చర్చా వేదికలో ఓపిడిఆర్ జిల్లా కార్యదర్శి ఆర్.శివశంకర్, పలు సంఘాల నాయకులు బొగ్గరపు రాధాకృష్ణమూర్తి, కల్పం రమేష్, ఏ.శ్రీనివాసులు, టి.లక్ష్మీనారాయణ, సి.హెచ్.ప్రసాద్ బాబు, వి.బ్రహ్మయ్య, తోట సులోచనలతో పాటు ఏపీటిఎఫ్, యుటిఎఫ్, జనవిజ్ఞాన వేదిక, తెలుగు భాషోద్యమ సమితి, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పాత్రికేయులు పాల్గొన్నారు. చర్చా వేదికలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికి తెలుగు భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని ఎక్కువ మంది స్పష్టం చేశారు.


