పథకాలపై నిలదీసిన ప్రజలుప్రజాపాలన సభల సాక్షిగా కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకత పెల్లుబికింది. ఎక్కడికక్కడ ప్రజలంతా కలిసి ప్రజా ప్రతినిధులను నిలదీశారు. పథకాలు ఏవి? యూరియా ఏది? రైతుభరోసా ఏది? అంటూ అన్ని సభ ల్లో ప్రశ్నల వర్షం కురిసింది. వాస్తవానికి 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమా లు, అమలుచేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2 నుంచి అమలు చేపట్టబోయే కొత్త పథకాలను సైతం ప్రజలకు వివరించాలని సూచించింది. ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలంతా హాజరు కావాలని ఆదేశించింది. ప్రభుత్వం ఒకటి తలిస్తే ప్రజలు మరోలా అమలుచేశారు. ఈ సభలే వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, పథకాలు ఎందుకు అమలు చేయడంలేదు? అంటూ పలుచోట్ల ఘెరావ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు రూ.2,500 హామీ ఎందుకు అమలు చే యడం లేదు? పింఛన్లు రూ.4వేలకు ఎప్పుడు పెంచుతారు? అంటూ నిలదీశారు. యూరి యా దొరుకక గోస పడుతున్నామంటూ రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు లేని యూరియా తిప్పలు ఇప్పుడే ఎందుకు వస్తున్నదంటూ నిలదీశారు. కొత్త పథకాల అమలు ఏమోగానీ ఉన్న పథకాలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.


