గాజువాక, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి):
గాజువాక నియోజవర్గాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో జీవో నంబర్ 45, 30ల అమలుపై గాజువాక మండల రెవెన్యూ కార్యాలయంలో శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
గాజువాకలో వేలాది కుటుంబాలు భూ పట్టాలు, రెవెన్యూ రికార్డుల లోపాలతో అనిశ్చితిలో జీవనం సాగిస్తున్న పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవో నంబర్ 45 కింద దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరగాల్సిందేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందుకే జీవో నంబర్ 45, 30ల ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యానికి చోటు లేదు
వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వీఆర్వోలు, ప్లానింగ్ సెక్రటరీలు చిన్నచిన్న కారణాలు చూపి దరఖాస్తులను ఆలస్యం చేయడం తగదని ఎమ్మెల్యే హెచ్చరించారు. పారదర్శకంగా, కాలపరిమితిలోపే పరిశీలన పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
శాశ్వత పరిష్కారమే లక్ష్యం
గాజువాక భూ సమస్యను తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే చోట సమస్యకు పరిష్కారం లభించేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
ఈ ప్రత్యేక సమీక్షలో మండల రెవెన్యూ అధికారి శ్రీనివాస్, గాజువాక నియోజవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, 79వ వార్డు కార్పొరేటర్ రౌత్ శ్రీనివాసరావు, మండల సిబ్బంది పాల్గొన్నారు.


