200 బైక్‌లతో భారీ ర్యాలీ, కేతనం ఎగురవేసిన యువత
100 కేజీల భారీ కేక్ కట్, హోరెత్తిన జై శివాజీ నినాదాలు
పున్నమిప్రతినిధి ,రామచంద్రపురం
అతడు కేవలం కిరీటం ధరించిన రాజు మాత్రమే కాదు, బానిస సంకెళ్లను తెంచుకున్న అజేయ శక్తి. అన్యాయంపై ఎక్కుపెట్టిన అస్త్రం, తరతరాలకు తరగని స్ఫూర్తి ప్రదాత. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా రామచంద్రపురం మండలంలోని అనుపల్లి గ్రామంలో గురువారం అపూర్వ దృశ్యం ఆవిష్కృతమైంది. దేశభక్తి విస్ఫోటనాన్ని తలపిస్తూ యువత నిర్వహించిన వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.
కాషాయమయమైన వీధులు
శివాజీ జయంతిని పురస్కరించుకుని స్థానిక యువత భారీ ఎత్తున కదం తొక్కారు. సుమారు 200 బైక్‌లతో చేపట్టిన మెగా ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. చేతిలో కాషాయ కేతనాలు పట్టుకుని యువత చేసిన నినాదాలతో అనుపల్లి వీధులు మారుమోగాయి. శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బాణసంచా పేలుస్తూ, 100 కేజీల భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
నేటి వేగవంతమైన ప్రపంచంలో శివాజీ మహారాజ్ జీవితం ఒక గొప్ప మేనేజ్‌మెంట్ పాఠం అని పలువురు వక్తలు కొనియాడారు. ఎటువంటి వనరులు లేని కాలంలోనే సామాన్యులను సైనికులుగా మార్చి, స్వరాజ్యాన్ని స్థాపించిన ఆయన ధైర్యం సాహసాల నిఘంటువని పేర్కొన్నారు.ఎదురుదెబ్బలకు కుంగిపోకుండా కొత్త దారి వెతుక్కోవడమే శివాజీ నేర్పిన పాఠం. నేటి యువతకు ఆయన ఆశయాలే అసలైన మార్గదర్శమని
యువత చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రముఖులు, పెద్దసంఖ్యలో యువతీ, యువకులు పాల్గొన్నారు.





