తిరుపతి జిల్లాలో గంజాయిని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఉత్తర్వుల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాస్ రావు ఆదేశాల ప్రకారం.. “వజ్ర ప్రహర్” కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఓబులవారిపల్లి మండలం వత్తులూరు వడ్డిపల్లి గ్రామంలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.రైల్వే కోడూరు రూరల్ సీఐ శ్రీ శ్రీనివాసులు, అర్బన్ సీఐ శ్రీ చంద్రశేఖర్ పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్లో ఓబులవారిపల్లి ఎస్సై పి. మహేష్, చిట్వేల్ ఎస్సై ఎస్. వినోద్, రైల్వే కోడూరు ఎస్సై ప్రసాద్ రెడ్డి మరియు రూరల్ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ మరియు వినియోగాన్ని అరికట్టడమే ధ్యేయంగా గ్రామంలోని అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు గృహాలను పోలీసులు సమగ్రంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ.. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు యువత బంగారు భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో నేరాల పెరుగుదలకు ఇవే ప్రధాన కారణమవుతున్నాయని, వీటిని అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారని స్పష్టం చేశారు. గంజాయి విక్రయించినా, నిల్వ ఉంచినా చట్టపరంగా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.తనిఖీల అనంతరం గ్రామస్తులతో సమావేశమైన పోలీసులు.. మహిళలపై నేరాలు, బాల్య వివాహాల నిరోధం, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు మరియు దొంగతనాల నివారణపై అవగాహన కల్పించారు. ఎక్కడైనా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.




