ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం రైల్వే స్టేషన్‌లోని పార్కింగ్ స్టాండ్‌లో వినియోగదారుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండో నెంబర్ ప్లాట్‌ఫారం వైపు ఉన్న పార్కింగ్ స్థలంలో రేట్ల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది.
పార్కింగ్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డు ప్రకారం జీఎస్టీతో కలిపి మొదటి రెండు గంటలకు ₹15, తరువాత ప్రతి గంటకు ₹10 చొప్పున వసూలు చేయాలని స్పష్టంగా పేర్కొనబడింది. ఈ లెక్కన ఒక వాహనం 24 గంటలు పార్క్ చేస్తే సుమారు ₹240 మాత్రమే కావాలి.
కానీ వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని వినియోగదారులు చెబుతున్నారు. ఒక వినియోగదారుడు కేవలం 12 గంటల పాటు తన బైక్‌ను పార్కింగ్‌లో ఉంచగా, అతనిపై ₹125 చార్జ్ చేసినట్లు సమాచారం. బోర్డు ప్రకారం లెక్కిస్తే అంత మొత్తం రావడం లేదని ప్రశ్నించగా, పార్కింగ్ కాంట్రాక్టర్ దౌర్జన్యంగా ప్రవర్తించినట్లు బాధితుడు తెలిపాడు.
ఇంకా మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, పార్కింగ్ బోర్డు మీద “GSTతో కలిపి రేట్లు” అని స్పష్టంగా వ్రాసి ఉన్నప్పటికీ, వినియోగదారులకు ఇచ్చిన బిల్లుపై మాత్రం ఎక్కడా GST నెంబర్ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
దీంతో అసలు వాస్తవంగా జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లిస్తున్నారా? లేక బోర్డుపై పేరు చెప్పి వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లు చేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రయాణికులు మరియు స్థానికులు ఈ వ్యవహారంపై రైల్వే అధికారులు, సంబంధిత శాఖలు విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలని, పార్కింగ్‌లో జరుగుతున్న అన్యాయ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



