✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి జిల్లా
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083
రాజమహేంద్రవరం,:
జర్నలిస్టులపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానాలను జర్నలిస్టు డెమోక్రటిక్ రైట్స్ ఫోరం (జెడిఆర్ఎఫ్) తీవ్రంగా ఖండిస్తున్నట్లు మేడా శ్రీనివాస స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో జర్నలిజం నాలుగో స్తంభమని, అలాంటి జర్నలిస్టులను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా, అర్ధరాత్రి వేళ తీవ్రవాదుల్లా అరెస్ట్ చేయడం రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
మహిళా ఐఏఎస్ అధికారి, మంత్రి సంబంధిత వార్త వ్యవహారంలో, సిట్ విచారణ ఇంకా కొనసాగుతున్న దశలోనే ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్లను అరెస్ట్ చేయడం దురదృష్టకరమని విమర్శించారు.
ఐదు రోజుల క్రితం ప్రసారమైన కథనంపై ఇప్పటికే ఎన్టీవీ యాజమాన్యం క్షమాపణలు కూడా తెలిపినప్పటికీ, ఆ తర్వాత కూడా జర్నలిస్టులపై కఠిన చర్యలకు దిగడం ప్రభుత్వ దురుద్దేశాన్ని స్పష్టంగా చూపుతోందని డా. సురేంద్రబాబు అన్నారు. “సిట్‌పై నిజంగా నమ్మకం ఉంటే, విచారణ పూర్తయ్యాకే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. ముందస్తు అరెస్టులు మీడియా స్వేచ్ఛను హరించడమే”
అని ఆయన వ్యాఖ్యానించారు.
నిరాధారమైన లేదా అసత్య కథనాలపై ఖండన కోరుకోవడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రతి పౌరుడి హక్కేనని, కానీ అర్ధరాత్రి అరెస్టులు, కుటుంబ సభ్యుల ముందే పోలీస్ దాడులు మీడియాను భయపెట్టే ప్రయత్నంగా మాత్రమే భావించాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్టీవీ జర్నలిస్టులు ముగ్గురూ సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్టులని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో వారి పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. అలాంటి వారిని నేరస్థులుగా చూపడం సమాజానికి తప్పు సంకేతాలు పంపుతుందని హెచ్చరించారు. ఈ తరహా చర్యలు కొనసాగితే రేపు ప్రజలకు నిజం చెప్పే ప్రతి గొంతు ప్రమాదంలో పడే పరిస్థితి వస్తుందని జెడిఆర్ఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.
జెడిఆర్ఎఫ్ డిమాండ్లు:
1. ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్‌లను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి
2). జర్నలిస్టులపై అర్ధరాత్రి అరెస్టుల సంస్కృతిని వెంటనే నిలిపివేయాలి
3). మీడియా స్వేచ్ఛకు, జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి
4). సిట్ విచారణను పారదర్శకంగా, రాజకీయ ఒత్తిడులు లేకుండా కొనసాగించాలి
మీడియా స్వేచ్ఛను అణిచే ఏ ప్రయత్నాన్నైనా దేశవ్యాప్తంగా తోటి జర్నలిస్టుల సంఘాలతో కలిసి తీవ్రంగా ఎదుర్కొంటామని జర్నలిస్టు డెమోక్రటిక్ రైట్స్ ఫోరం(జెడిఆర్ఎఫ్) స్పష్టం చేసింది.
End


