ఖమ్మం ఫిబ్రవరి
( పున్నమి జిల్లా ఇంచార్జి )
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని అఖిల భారత అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ (కేకేసి) ఖమ్మం జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించి “వీబీజీ–రామ్ జీ”గా మారుస్తూ మార్పులు చేయాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ, కేకేసి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ కౌశల్ సమీర్ పిలుపు మేరకు “యంజిఎన్ఆర్ఈజీఏ బచావో సంగ్రామం” కార్యక్రమంలో భాగంగా ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామపంచాయతీలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం కేకేసి మండల అధ్యక్షులు కొండ మధు గౌడ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికుల మధ్య జరిగింది.
ఈ సందర్భంగా విప్లవ కుమార్ పటేల్ మాట్లాడుతూ — దేశ గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల వలసలను నివారించేందుకు, అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సారథ్యంలో కేంద్ర నిధులతో గ్రామీణ ప్రజలకు సంవత్సరానికి 100 రోజుల ఉపాధి కల్పించేందుకు భారత జాతీయ కాంగ్రెస్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
అయితే ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పథకంపై ఆంక్షలు విధిస్తూ పేరు మార్పు సహా పలు సవరణలు తీసుకువస్తున్నదని, ఈ చర్యలను అఖిల భారత అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.
పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, మార్పులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కేకేసి జిల్లా ఉపాధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్, పోలేపల్లి గ్రామ సర్పంచ్ బత్తిని మహేష్, జిల్లా నాయకులు ఎండీ గయాజ్ పాషా, బి సతీష్, మెరుగు వెంకట్ నాయుడు, సిహెచ్ రాజు, బత్తిని వేలాద్రి, కొండం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.



