ఎల్బీనగర్: శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్‌లోని వినాయక్ నగర్ కాలనీ, రోడ్ నంబర్ 1లో జై భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1500 మందికి పైగా భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని నిర్వాహకులు ప్రార్థించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. జై భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరుసగా ఆరోసారి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం.
ఈ కార్యక్రమానికి చిలక వెంకట రెడ్డి, రమాదేవి అన్నదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గొప్ప సేవ అని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో భవిష్యత్తులోనూ ధార్మిక, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంతో వినాయక్ నగర్ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు సేవాభావాన్ని చాటిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.
